
Sunjay Kapur: బాలీవుడ్ లో విషాదం.. గుండెపోటుతో స్టార్ హీరోయిన్ మాజీ భర్త కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా సినీ రంగాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి.
ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవి కుమార్ అకాల మరణం మరిచిపోకముందే,తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్ అధినేతగా గుర్తింపు పొందిన కె. మహేంద్ర (వయసు 79) మృతి చెందారు.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు వెల్లడించారు.
ఇవన్నీ మరవకముందే ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది.
ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్తగా,ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరొందిన సంజయ్ కపూర్ (53) హఠాన్మరణం చెందారు.
ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ పోలో మ్యాచ్ సందర్భంగా ఆట ఆడుతుండగా ఆయన్ను గుండెపోటు గురైనట్లు సమాచారం.
వివరాలు
2003లో సంజయ్ కపూర్‌ను వివాహం చేసుకున్న కరిష్మా కపూర్
ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం, సంజయ్ కపూర్ పోలో ఆడుతున్న సమయంలో అనుకోకుండా ఒక తేనెటీగ నోట్లోకి ప్రవేశించింది.
దానివల్ల తీవ్రమైన అలెర్జిక్ ప్రతిచర్య (ఆనాఫైలాక్సిస్) ఏర్పడి శ్వాస తీసుకోలేని స్థితికి చేరుకున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేశారు.
ఈ పరిస్థితే గుండెపోటుకు దారితీసి, చివరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
అక్కడి వైద్య బృందం తక్షణమే చికిత్స ప్రారంభించినా, ఆయన్ను కాపాడలేకపోయారని పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
1990లలో బాలీవుడ్‌ను ఏలిన కరిష్మా కపూర్,2003లో సంజయ్ కపూర్‌ను వివాహం చేసుకొని లండన్‌కి వెళ్లిపోయింది.
వీరికి ఇద్దరు సంతానం.అయితే,వారి మధ్య విభేదాలు వచ్చి,2014లో వేరు కావడంతో పాటు 2016లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
వివరాలు
సంజయ్ కపూర్ భారత ఆటోమోటివ్ పరిశ్రమలో కీలక పాత్ర
అనంతరం సంజయ్ కపూర్, ప్రియా సచ్దేవ్ను రెండో వివాహం చేసుకున్నారు. ఇక కరిష్మా అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్నారు.
సంజయ్ కపూర్ భారత ఆటోమోటివ్ పరిశ్రమలో కీలక పాత్ర పోషించారు.
ఆయన సోనా కామ్స్టార్ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరించడమే కాక,ఆటోమోటివ్ కాంపోనెంట్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ACMA) అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి గొప్పదిగా అభిప్రాయపడుతున్నారు.అంతేకాదు,తన మరణానికి కొన్ని గంటల ముందే సంజయ్ కపూర్ అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు.
ఆయన ఆకస్మిక మరణం పట్ల సినీ రంగంతో పాటు వ్యాపార వర్గాలకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.