హ్యాపీ బర్త్ డే కృష్ణ: తెలుగు సినిమాకు కొత్త సాంకేతికతను పరిచయం చేసిన నటుడు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా చరిత్రలో కృష్ణ అధ్యాయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. తెలుగు సినిమాకు కొత్త కొత్త సాంకేతికతను పరిచయం చేసారు కృష్ణ.
తెలుగులో మొట్టమొదటి 70ఎంఎం చిత్రం, మొదటి డీటీఎస్ చిత్రం, మొదటి ఈస్ట్ మన్ కలర్ చిత్రం, మొదటి సినిమా స్కోప్ చిత్రం, మొదటి కౌబాయ్ చిత్రాలను కృష్ణ పరిచయం చేసారు.
ఈరోజు కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
1943లో మే 31వ తేదీన గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు కృష్ణ. చిన్నప్పటి నుండి నటన మీద ఆసక్తి ఉండడంతో సినిమాల వైపు వెళ్ళారు.
ఆయన హీరోగా చేసిన మొదటి చిత్రం తేనె మనసులు 1965లో విడుదలైంది.
Details
50దేశాల్లో రిలీజ్ అయిన మోసగాళ్ళకు మోసగాడు
మొదటిసారిగా గూఢచారి 116 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు కృష్ణ. తెలుగులో తెరకెక్కిన తొలి జేమ్స్ బాండ్ తరహా మూవీ ఇదే.
మొట్ట మొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్ళకు మోసగాడు 1970లో విడుదలైంది. మోసగాళ్ళకు మోసగాడు సినిమాను ఇంగ్లీష్ లోకి డబ్ చేసి 50దేశాల్లో రిలీజ్ చేసారు. తెలుగు సినిమా చరిత్రలో మోసగాళ్ళకు మోసగాడు సినిమా చాలా ప్రత్యేకం.
కృష్ణ నటించిన సినిమాల్లో అల్లూరి సీతారామరాజు గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. అల్లూరి జీవిత కథను ఎన్టీ రామారావు తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ చివరకు కృష్ణ తెరకెక్కించి హిట్టు కొట్టారు.
నటుడిగా 350కి పైగా సినిమాల్లో నటించారు కృష్ణ. నటుడిగా కృష్ణ చాలా బిజీగా ఉండేవారు. ఒక రోజులో నాలుగు షిప్టులు పనిచేసేవారు.
Details
ఎంపీగా గెలిచిన కృష్ణ
ఒకే స్టూడియోలో నాలుగు ఫ్లోర్లలో కృష్ణ సినిమాల షూటింగులు జరిగేవి. ఒక ఏడాదిలో కృష్ణ నటించిన 17సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఈ 17సినిమాల్లో 9సినిమాలు వందరోజులు ఆడాయి.
హీరోగా, నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన కృష్ణ, 2017లో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ తన సత్తా చాటారు కృష్ణ.
1989లో ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1991లో అదే నియోజకవర్గం నుండి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు కృష్ణ.
తెలుగు సినిమాకు విశేష సేవలందించిన కృష్ణ, 2022 నవంబర్ 15వ తేదీన స్వర్గస్తులయ్యారు.