Raja Saab: రాజాసాబ్ విడుదలపై సస్పెన్స్.. సిద్ధమైన టీజర్!
గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ 'రాజాసాబ్' సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అవుతుందని మొదటగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన బచ్చలమల్లి ప్రమోషనల్ ఈవెంట్‌లో రాజాసాబ్ షూటింగ్ పూర్తయిందని స్పష్టం చేశారు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు ఏ తేదీకి చూడాలనుకుంటే, ఆ రోజే రాజాసాబ్ విడుదలవుతుందంటూ మారుతి చేసిన సరదా వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తేనే పూర్తి క్లారిటీ వస్తుందనే అభిప్రాయంతో అభిమానులు ఉన్నారు.
2 నిమిషాలు 15 సెకన్లు టీజర్
ఇక రాజాసాబ్ టీజర్ రన్‌టైమ్ 2 నిమిషాల 15 సెకన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. మోషన్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. హారర్ కామెడీ జానర్‌లో ప్రభాస్ నటించడం అభిమానులకు కొత్త అనుభూతినిచ్చేలా ఉంటుంది. మరి రాజాసాబ్ అనుకున్న విడుదల తేదీకే వస్తుందా లేక వాయిదా పడుతుందా అన్నది మేకర్స్ అధికారిక ప్రకటనతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.