Abhinay: కాలేయ వ్యాధితో తమిళ నటుడు అభినయ్ హఠాన్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ నటుడు అభినయ్ (44) మరణించారు. కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన, సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో చివరి శ్వాస విడిచారు. 'తుళ్లువాదో ఇల్లమై' చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే చాలా ఏళ్లుగా ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి.చికిత్స కోసం సాయం కోరగా సహనటులు ధనుష్, హాస్యనటుడు కేపీవై బాలా సాయం చేశారు. ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ కథ రచనలో, వారి తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో రూపొందిన 'తుళ్లువాదో ఇల్లమై' సినిమాతో అభినయ్ సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆరుగురు హైస్కూల్ విద్యార్థుల నేపథ్యంతో తీసిన ఈ చిత్రంలో అభినయ్ కీలక పాత్ర పోషించాడు.
వివరాలు
ఆరోగ్యం క్షీణించడంతో కొంతకాలం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశాడు
ఈ సినిమా అప్పట్లో కాసుల వర్షం కూడా కురిపించింది. 2014 వరకు అభినయ్ తమిళం, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించాడు. ఆరోగ్యం క్షీణించడంతో కొంతకాలం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశాడు. అయితే ఈ సంవత్సరం దర్శకుడు అభిషేక్ లెస్లీ తీసిన తమిళ చిత్రం 'గేమ్ ఆఫ్ లోన్స్' ద్వారా తిరిగి తెరపైకి వచ్చాడు. ఈ సినిమా ప్రచార సమయంలో అక్టోబర్ నెలలో మీడియా ముందుకు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇంతలోనే మృత్యువు వెంటాడింది. ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని కోడంబార్కంలోని ఆయన నివాసంలో ఉంచినట్లు సినీ వర్గాలు తెలిపాయి.