మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న?
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ, తారకరత్న పరిస్థితిని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. తాజాగా నందమూరి తారకరత్న గురించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. హిందూపూర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు అంబికా లక్ష్మీ నారాయణ, తారకరత్న ఆరోగ్యం గురించి మాట్లాడింది. మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్ళే అవకాశం ఉందని హింట్స్ ఇచ్చారు అంబికా. ప్రస్తుతం వైద్యులు తారకత్న బ్రెయిన్ ని స్కాన్ చేసారని, రిపోర్ట్ లో వచ్చిన ఫలితాలను బట్టి ఫారెన్ కి తీసుకెళ్లాలా లేదా అనేది తేలుతుందని తెలుస్తోంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి తొందరగా మెరుగవ్వడానికి ఫారెన్ తీసుకెళ్ళాలని తారకరత్న కుటుంబం ఆలోచిస్తుందని సమాచారం.
కుప్పంలో కుప్పకూలిన నందమూరి తారకరత్న
టిడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, యువగళం పేరుతో కుప్పంలో మొదలెట్టిన పాదయాత్రలో జనాల మధ్య కుప్పకూలి పడిపోయాడు తారకరత్న. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఇలా జరగడంతో వెంటనే కుప్పంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొన్నిరోజుల పాటు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి అభిమానులు అందరికీ ఆందోళనగా ఉండింది. తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేసారు. ప్రస్తుతానికైతే తారకరత్న, వైద్యానికి స్పందిస్తున్నారని, పరిస్థితి మెరుగు పడిందని వార్తలు వచ్చాయి. దీంతో అటు నందమూరి అభిమానులు, ఇటు సినిమా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తారకరత్న ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.