Konda Surekha: అనుకోకుండాప్రస్తావించా.. ఎవరిమీద వ్యక్తిగత ద్వేషం లేదు: కొండా సురేఖ
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనపై చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు భావోద్వేగానికి గురయ్యేలా చేశాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. హనుమకొండలో మీడియాతో మాట్లాడిన ఆమె, కేటీఆర్‌పై విమర్శలు చేసే సమయంలో అనుకోకుండా ఒక కుటుంబాన్ని ప్రస్తావించానని వివరణ ఇచ్చారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా ద్వేషం లేదని, ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి ఎంతో బాధపడ్డానని సురేఖ తెలిపారు.
నోటీసు విషయంలో న్యాయపరంగా ముందుకు సాగుతాం: సురేఖ
''ఎందుకు నేను బాధపడ్డానో అదే విషయంలో మరొకరిని బాధపెట్టినట్లుగా తెలిసిన వెంటనే, నా వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నాను. నేను అనుభవించిన బాధను వేరేవాళ్లు అనుభవించకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. అప్పుడే దీనిపై స్పందిస్తూ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టాను అని అన్నారు. కేటీఆర్ విషయంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయనే అన్నీ చేసి, నన్ను క్షమాపణ కోరడం అంటే 'దొంగే దొంగా అని అరవడం' వంటిదని సురేఖ వ్యాఖ్యానించారు. కేటీఆర్ పంపిన లీగల్ నోటీసు విషయంలో న్యాయపరంగా ముందుకు సాగుతామని ఆమె తెలిపారు.