గ్యాంగ్ లీడర్ తో పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత నటుడు వల్లభనేని జనార్ధన్ ఇక లేరు
చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ సుమలతకు తండ్రి పాత్రలో మెప్పించిన నటుడు వల్లభనేని జనార్ధన్, ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. 63సంవత్సరాల వయసులో అనారోగ్యంతో ఆసుపతి పాలై చివరకు తన ప్రాణాలు విడిచారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించారు వల్లభనేని జనార్ధన్. ఆయనకు చిన్నతంలో నాటకాలంటే ఆసక్తి ఉండేది. ఆ మక్కువతోనే సినిమాల వైపు వచ్చారు. కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన గజదొంగ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు జనార్థన్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తుండగా, దర్శకుడు విజయ బాపినీడు తన కూతురునిచ్చి వివాహం చేసారు. ఆ తర్వాత బాపినీడు దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించారు.
గ్యాంగ్ లీడర్ తో గుర్తింపు
గ్యాంగ్ లీడర్ లో సుమలత తండ్రిగా పోలీసు పాత్రలో విలనిజం పండించారు జనార్ధన్. ఈ పాత్రకు అప్పట్లో మంచి గుర్తింపు వచ్చింది. దాంతో నటుడిగా అవకాశాలు చాలా వచ్చాయి. ఐతే నటుడిగా ఉండిపోకుండా నిర్మాతగా మారి, శ్రీమతి కావాలి అనే సినిమాను తెరకెక్కించాడు. సీరియళ్ళలోనూ మెరిసారు వల్లభనేని జనార్ధన్. ఈటీవీలో ప్రసారమైన అన్వేషిత సీరియల్ లో నటించారు. చేసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే పాత్రల్లో మెరిసారు. కుటుంబ విషయానికొస్తే, ఈయనకు ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు. పెద్దకూతురు శ్వేత చిన్నతనంలోనే మరణించింది. చిన్న కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తోంది. కొడుకు అవినాష్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అమెరికాలో ఉన్నారు.