టాలీవుడ్ లో విషాదం: సీనియర్ నటుడు శరత్ బాబు ఇకలేరు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు శరత్ బాబు(71) ఈరోజు కన్నుమూశారు.
కొన్నిరోజులుగా అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడుతున్న శరత్ బాబు, హైదరాబాలోని ఏఐజీ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచాడు.
శరీరంలోని అవయవాలు, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు మొదలగునవి పాడైపోవడంతో శరత్ బాబు కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
శరత్ బాబు మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు.. సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
Details
250కి పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు
1951 జులై 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస గ్రామంలో జన్మించారు శరత్ బాబు. చిన్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు. కానీ నాటకరంగం వైపు వచ్చాడు.
1973లో శరత్ బాబు నటించిన తొలి సినిమా రామరాజ్యం విడుదలైంది. ఆ తర్వాత సీతాకోక చిలుక, మూడుముళ్ళ బంధం, గుప్పెడంత మనసు, సాగర సంగమం, సంసారం ఒక చదరంగం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, హీరోగానూ సినిమాలు చేసాడు. తెలుగు, తమిళం కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో కలుపుకుని 250కి పైగా సినిమాల్లో నటించాడు శరత్ బాబు.
ఆయన చివరగా నటించిన చిత్రం మళ్ళీ పెళ్ళి.