కలవరపెడుతున్న వరుస టాలీవుడ్ నటుల మరణాలు
గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతున్న వరుస మరణాలు తెలుగు సినిమా అభిమానులకు కలవరం కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న సీనియర్ నటుడు చలపతి రావు హఠాత్తుగా చనిపోవడంతో అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా, మంచాన పడకుండా తన దేహాన్ని వదిలారు చలపతి రావు. రాత్రి చికెన్ బిర్యానీ తిని, పళ్ళెం పక్కన పెడుతుండగా కళ్ళు మూసుకుని పడిపోయారని రవిబాబు చెప్పుకొచ్చారు. చలపతి రావు అంత్యక్రియలు డిసెంబరు 28వ తేదీన జరగనున్నాయి. ఆయన కుమార్తెలు ఇద్దరూ అమెరికా నుండి వస్తుండడం వల్ల ఆలస్యం అవుతుందని సమాచారం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రల్లో మెరిసిన చలపతి రావు, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు.
కలవరపెడుతున్న వరుస మరణాలు
ఐతే టాలీవుడ్ లెజెండ్, సీనియర్ మోస్ట్ నటుడు కైకాల సత్యనారాయణ చనిపోయిన తర్వాతి రోజే చలపతి రావు మరణవార్త వినిపించడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు స్వర్గస్తులవుతుండడం పరిశ్రమకు తీరని లోటుగా మారింది. కొన్ని నెలల కాలంలోనే రెబెల్ స్టార్ కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు తెలుగు పరిశ్రమను వదిలి వెళ్ళిపోయారు. వరుసగా జరుగుతున్న మరణాలు తెలుగు సినిమా అభిమానులను, పరిశ్రమ ప్రజలను బాధకి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలో అదోలాంటి నిశ్శబ్దం అలుముకుంది. వయసు రీత్యా వచ్చిన వ్యాధుల వల్లే వాళ్ళందరూ దూరమైనా కూడా ఏదో తెలియని వ్యాకులం పరిశ్రమలో నెలకొన్నట్లు తెలుస్తోంది.