తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా
ఈ సంవత్సరం తెలుగు సినిమాకు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్, కార్తికేయ, సీతారామం, బింబిసార సినిమాలతో బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షం కురిసింది. ఇదే టైమ్ లో ఇతర బాషల నుండి తెలుగులో డబ్ అయిన కేజీఎఫ్, కాంతార, విక్రమ్, లవ్ టుడే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఐతే సంవత్సరాంతంలో వచ్చిన తెలుగు సినిమాల ముందు తమిళం నుండి వచ్చిన డబ్బింగ్ చిత్రాలు నిలబడలేకపోయాయి. ఈ వారం థియేటర్లలో తెలుగు సినిమాలైన ధమాకా, 18 పేజెస్ తో పాటు తమిళం నుండి వచ్చిన అనువాద చిత్రాలు కనెక్ట్, లాఠీ విడుదల అయ్యాయి. కానీ ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ధమాకా దూసుకుపోతుండగా, 18పేజెస్ నెమ్మదిగా ప్రేక్షకుల మనసుల్లోకి ఎక్కుతోంది.
కంటెంటే కారణం
ప్రస్తుతానికి ధమాకా, 18 పేజెస్ చిత్రాలకు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. చాలా రోజుల తర్వాత రవితేజకు సరిపోయే పాత్ర దొరికిందని, డాన్సుల్లో రవితేజ ఇరగదీసాడని చెప్పుకుంటున్నారు. ఇక 18పేజెస్ సినిమా ఒక అందమైన ప్రేమ కావ్యంలా ఉందని అంటున్నారు. సుకుమార్ రాసిన కథతో వచ్చిన ఈ సినిమా, ఆద్యంతం విభిన్నంగా ఉందని రివ్యూలు ఇస్తున్నారు. ఇక కనెక్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది నయనతార. భర్త విఘ్నేష్ శివన్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. విశాల్ కి తెలుగులో హిట్ దొరికి చాలా రోజులైపోయింది. లాఠీ సినిమాతో ఆ లోటు తీరుతుందని ఆయన అభిమానులు అనుకున్నారు. కానీ కథ రొటీన్ గా రొటీన్ గా ఉందని చెప్పుకుంటున్నారు.