Simhasanam movie @ 40years: రికార్డుల రాజు 'సింహాసనం'.. భారీ బడ్జెట్.. థియేటర్ల వద్ద 144 సెక్షన్ జ్ఞాపకాలు!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సినీ చరిత్రలో సాహసానికి ప్రతీకగా, ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన 'సూపర్ స్టార్' కృష్ణ రూపొందించిన మహత్తర చిత్రం 'సింహాసనం' (Simhasanam) విడుదలై నేటితో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1986 మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనేక సాంకేతిక, నిర్మాణాత్మక విశేషాలతో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కృష్ణ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినిమాకు కూడా కొత్త దిశను చూపించిన చిత్రాల్లో 'గూఢచారి 116', 'మోసగాళ్లకు మోసగాడు', 'అల్లూరి సీతారామరాజు' వంటి విప్లవాత్మక సినిమాల తర్వాత 'సింహాసనం' మరో మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా తొలి తెలుగు 70MM 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్‌తో తెరకెక్కిన చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది.
వివరాలు
ఇదీ కథ
దశార్ణ రాజ్య సైన్యాధిపతి విక్రమసింహ (కృష్ణ) ప్రతిభను గుర్తించిన రాజు క్షేమేంద్ర భూపతి అతనికి భవానీ ఖడ్గాన్ని బహుమతిగా అందిస్తాడు. యువరాణి అలకనందాదేవి (జయప్రద) విక్రమసింహను ప్రేమిస్తుంది. కానీ మంత్రి భేరుండ (ప్రభాకరరెడ్డి) కుట్రల కారణంగా విక్రమసింహ రాజ్య బహిష్కరణకు గురవుతాడు. తర్వాత అతను మళ్లీ రాజ్యంలోకి ఎలా ప్రవేశించాడు? అవంతి యువరాజు ఆదిత్యవర్థనుడికి విక్రమసింహతో ఉన్న పోలికల వెనుక రహస్యం ఏమిటి? నృత్యకారిణి జస్వంతి (రాధ), యువరాణి (జయప్రద), విషకన్య చందన (మందాకిని) పాత్రల ప్రాధాన్యం ఏంటి? ఇరు రాజ్యాల్లో శాంతిని స్థాపించేందుకు విక్రమసింహ, ఆదిత్యవర్థనులు కలిసి ఎలా కుట్రలను ఛేదించారు? అన్నదే ఈ చిత్ర ప్రధాన కథ.
వివరాలు
రెండు భాషల్లో ఒకేసారి నిర్మాణం
జానపద చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టించిన 'సింహాసనం' కృష్ణ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా కావడం విశేషం. ఇందులో ఆయన సైన్యాధిపతి, యువరాజు అనే రెండు భిన్న పాత్రల్లో నటించారు. జయప్రద, రాధ, మందాకిని కథానాయికలుగా కనిపించారు. తెలుగులో 'సింహాసనం', హిందీలో 'సింఘాసన్' పేర్లతో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీ వెర్షన్‌లో జితేంద్ర హీరోగా నటించారు. అప్పట్లోనే ఈ సినిమాకు మూడు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.
వివరాలు
బాక్సాఫీస్ విజయాలు
విడుదలైన మొదటి వారంలోనే ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి పంపిణీదారులకు లాభాలు తెచ్చింది. తొలి వారంలోనే రూ.1.5 కోట్లకు పైగా వసూలు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రధాన కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శితమైంది. మద్రాసులో శతదినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. చెన్నైలోని వీజీపీ గార్డెన్స్‌లో జరిగిన వేడుకకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 400 బస్సుల్లో అభిమానులు తరలివచ్చారు.
వివరాలు
ఎవర్‌గ్రీన్ పాటలు
ఈ చిత్రానికి కృష్ణ మరో ప్రయోగంగా యువ గాయకుడు రాజ్ సీతారామ్‌ను పరిచయం చేశారు. అప్పట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో జరిగిన చిన్న విభేదాల నేపథ్యంలో కొత్త గొంతుకు అవకాశం ఇచ్చారు. రాజ్ సీతారామ్ పాడిన పాటలు విశేష ఆదరణ పొందాయి. అలాగే సంగీత దర్శకుడిగా బప్పీ లహరిని పరిచయం చేశారు. 'ఆకాశంలో ఒక తార...', 'అరే వహవా నీ యవ్వనం...' వంటి పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
వివరాలు
భారీ బడ్జెట్, గ్రాండ్ సెట్స్
ఆ కాలంలో సాధారణంగా సినిమాలకు రూ.40-50 లక్షల బడ్జెట్ ఉండగా, 'సింహాసనం' కోసం కృష్ణ సుమారు రూ.3.20 కోట్లు ఖర్చు చేశారు. తెలుగు, హిందీ వెర్షన్‌లను కేవలం 65 రోజుల్లో పూర్తి చేశారు. హైదరాబాద్ పద్మాలయ స్టూడియోతో పాటు హోగెనక్కల్, మైసూర్ ప్రాంతాల్లో భారీ సెట్స్ వేసి చిత్రీకరించారు. తొలి 70MM సాంకేతికత 70MM 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌తో తెరకెక్కిన తొలి తెలుగు చిత్రంగా 'సింహాసనం' నిలిచింది. అప్పట్లో థియేటర్లు లేకపోవడంతో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్క్రీన్‌లు సిద్ధం చేశారు. విజయవాడలో అలంకార్ థియేటర్ వద్ద 95అడుగుల, బెంజ్ సర్కిల్ వద్ద 75అడుగుల కృష్ణ కటౌట్లు ఏర్పాటు చేయడం విశేష ఆకర్షణగా నిలిచింది.
వివరాలు
144 సెక్షన్ అమలు
ఈ చిత్రానికి వచ్చిన అపార స్పందన కారణంగా థియేటర్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో రహదారులను మళ్లించారు. విజయవాడలో కొన్ని థియేటర్ల వద్ద జనసందోహాన్ని నియంత్రించేందుకు 144 సెక్షన్ అమలు చేశారు. టికెట్ ఉన్నవారినే లోపలికి అనుమతించే పరిస్థితి ఏర్పడింది. తెలుగు సినిమా చరిత్రలో ఒక చిత్రానికి 144 సెక్షన్ విధించడం ఇదే మొదటిసారి.
వివరాలు
శ్రీదేవి స్థానంలో మందాకిని
ఈ చిత్రానికి భారీ తారాగణాన్ని ఎంపిక చేశారు. రెండు భాషల్లో హీరోలు మారినా, జయప్రద, రాధ, మందాకిని మాత్రం యథాతథంగా కొనసాగారు. అవంతి మహారాణిగా వహీదా రెహమాన్ కనిపించారు. మొదట విషకన్య పాత్రకు శ్రీదేవిని తీసుకోవాలని భావించినా, తాజాదనాన్ని దృష్టిలో ఉంచుకుని హిందీలో 'రామ్ తేరీ గంగా మైలీ'తో గుర్తింపు పొందిన మందాకినిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కృష్ణ సోదరుడు జి. ఆదిశేషగిరిరావు వెల్లడించారు. ఇలా 'సింహాసనం' చిత్రం సాంకేతికంగా, నిర్మాణ పరంగా, వసూళ్ల పరంగా తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని నేటికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంది.