
Singireddy Narayana Reddy: పాటలలో పరవశించిన కవి.. తెలుగు గేయానికి తాళం చెక్కిన తాత్వికుడు 'సినారే'!
ఈ వార్తాకథనం ఏంటి
పద్యాల నుంచి పాటల దాకా... గేయాల నుంచి గజల్స్ దాకా... ఖండికల నుంచి కావ్యాల దాకా... అక్షరాలన్నింటినీ తన తూలికతో రంజింపజేసిన సాహిత్య రత్నం, తెలంగాణ గర్వించదగ్గ ముద్దుబిడ్డ, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఆయన రాసిన ప్రతి అక్షరం తెలుగు వాఙ్మయానికి విలువైన ఆస్తిగా నిలిచింది. సాహిత్య వనంలో విహరించిన సినారె, సినీ ప్రపంచంలోనూ తానొక అమూల్య గీతకారుడిగా మిగిలారు. ఈనెల 12న ఆయన వర్థంతి సందర్భంగా పలు విషయాలను తెలుసుకుందాం.
Details
తొలి అడుగులే చరిత్రాత్మకం
'కలల అలలపై తేలెను..' అనే పాటతో 'గులేబకావళి కథ'లో సినారె సినీ ప్రయాణం మొదలైంది. మొదటి సినిమా నుంచే అన్ని పాటలు తనకే రాయాలన్న ఆత్మవిశ్వాసానికి ఎన్టీఆర్ మద్దతుగా నిలిచారు. 'జోలా జోలమ్మ జోలా' , 'వటపత్ర శాయికి వరహాల లాలి' లాంటి పాటలతో పిల్లల మనసుల్లోనూ, తల్లుల హృదయాల్లోనూ చిరస్థాయిగా నిలిచారు. 'అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి..' అంటూ బంధాల విలువను పదాల్లో కూర్చారు. పద ప్రయోగాల్లో సినారె ప్రత్యేకత 'పగలే వెన్నెల.. జగమే ఊయల..' పాటలో చూపిన భావనల లోతు, 'కదలే ఊహలకే కన్నులుంటే..' అనే ప్రయోగంలో చూపిన కవిత్వ పరిపక్వత సినారెను విలక్షణంగా నిలిపాయి. ఆయన రాసిన ప్రతి పంక్తికి అర్థవ్యాప్తి, భావవిశిష్టత తోడుగా ఉండేది.
Details
గీతాలూ, సంభాషణలూ - రెండింటిలోనూ దిట్ట
'ఏకవీర' చిత్రానికి పాటలతో పాటు డైలాగ్స్ కూడా సినారే రాశారు. 'తోటలో నా రాజు తొంగి చూసెను' పాటను దేవులపల్లి రాసారని చాలామందికి అపోహ! ఆ స్థాయిలో ఉన్నది కదా సినారె కలం! సామాజిక స్పృహతో కూడిన గీతాలు 'కర్ణ' చిత్రంలోని 'గాలికి కులమేది.. నేలకు కులమేది..' పాటలో చూపిన సామాజిక సందేశం, 'భళారే విచిత్రం.. అయ్యారే విచిత్రం' అనే పాటలు సినారె శైలికి నిదర్శనం. సంస్కృత సమాసాల గీతాలలో సినారె సాహసాలు 'చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన..', 'శివరంజనీ నవరాగిణి..', 'సంగీత సాహిత్య సమలంకృతే..' లాంటి గీతాల్లో సంస్కృత సమాసాల గాఢత, సంగీత సాహిత్య మేళనం కనిపిస్తుంది. 'వేదవేదాంత వనవాసిని..' వంటి పద ప్రయోగాలతో ఆయన రచనలు పండితుల మనసులనూ అలరించాయి.
Details
సినారె పాటలు - కర్పూర సుగంధాలు
'నిన్నలేని అందమేదో..', 'అమ్మను మించి దైవమున్నదా..', 'స్నేహమే నా జీవితం..', 'నినుచూడక నేనుండలేను..' లాంటి పాటలు శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేసాయి. పాటలతో భావోద్వేగాలను రేకెత్తించిన ఈ కవి, ప్రతి భావానికి తగిన పదాన్ని జోడించడంలో నిపుణుడు. పాటలే తన శ్వాస సినారె, "ఈ స్థాయికి తక్కువగా నేను రాయను" అని నిర్మొహమాటంగా చెప్పేవారు. "ఎన్ని తెన్నుల కైత కన్నె విహరించిననూ.. పాటలోనే నాదు ప్రాణాలు గలవందు" అని అత్మీయంగా ప్రకటించిన ఆయన, సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ తనదైన ముద్ర వేశారు. కాని, గేయరచనే తనకు హృదయస్పర్శగా మిగిలింది.
Details
కొన్ని అజరామర గీతాలు
మబ్బులో ఏముంది.. నా మనసులో.. చెలికాడు నిన్నే రమ్మని పిలువా.. ఈ రేయి తీయనిది.. శ్రుతి నీవు.. గతి నీవు.. ఈ నా కృతి నీవు.. ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా.. వస్తాడు నా రాజు ఈ రోజు.. తెలుగు భాషను విశ్వభాషగా వికసింపజేసిన సినారెకు శతకోటి వందనాలు.