Anil Ravipudi : నేటి నుంచి వెంకటేష్ - కళ్యాణ్ రామ్ - అనిల్ రావిపూడి షూటింగ్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో వరుస విజయాలతో హిట్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి మరో భారీ మల్టీస్టారర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ప్రతి సంక్రాంతికి ఓ విజయవంతమైన చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. గత ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో ఘన విజయం సాధించగా, ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల కలయికలో ఓ క్రేజీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులను అలరించే వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనిల్ రావిపూడి, ఈ సినిమాను పూర్తి స్థాయి హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.
వివరాలు
నేటి నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్..
ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఒక పాటతో పాటు పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. తాజా సమాచారం ప్రకారం జూలై 2 నుంచి కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమవుతోంది. ఈ షెడ్యూల్‌లో విక్టరీ వెంకటేష్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఎలాంటి విరామాలు లేకుండా షూటింగ్‌ను నిరంతరాయంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో అనిల్ రావిపూడి ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్ నాటికి మొత్తం చిత్రీకరణను ముగించాలనే ఉద్దేశంతో చిత్రబృందం పనులను వేగవంతం చేసింది.
వివరాలు
వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి..
ఈ చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి కనిపించనుంది. ఈ రెండు క్రేజీ జంటలను వెండితెరపై అనిల్ రావిపూడి ఎలా ఆవిష్కరిస్తారనే దానిపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా సంగీతపరంగానూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి ఈ చిత్రంతో మరోసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాల్సి ఉంది.