తెలుగులో పాత సినిమాలు చూడాలని అనుకుంటున్నారా? ఈ సినిమాలతో స్టార్ట్ చేయండి
వీకెండ్ వచ్చేసింది. కాబట్టి ఎక్కడలేని బద్దకమంతా ఒంట్లోకి వచ్చేస్తుంటుంది. ఇలాంటి టైమ్ లో ఓపిక ఉంటే థియేటర్ కి వెళ్ళి సినిమా చూడటం, లేదంటే ఓటీటీల్లో సిరీస్ చూసేయడం చేస్తుంటారు. అయితే ఈ వీకెండ్ ని తెలుగులోని పాత సినిమాలను చూడండి. మీకు సరికొత్త అనుభవం కలుగుతుంది. ఎలాంటి సినిమాలతో స్టార్ట్ చేయాలో తెలియకపోతే ఇక్కడ చూడండి. పాతాళ భైరవి (1951): పాత సినిమాలను చూడాలనుకుంటే జానపద సినిమాలతో మొదలు పెడితే ఆసక్తిగా ఉంటుంది. జానపద సినిమాల్లో పాతాళ భైరవి ప్రత్యేకతే వేరు. తోటరాముడిగా ఎన్టీఆర్, నేపాల మాంత్రికుడిగా ఎస్వీ రంగారావుల నటన నభూతో నభవిష్యత్. ఈ చిత్రానికి పింగళి నాగేంద్రరావు కథ అందించగా, కేవీ రెడ్డి దర్శకత్వం వహించారు.
తెలుగులో క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్న సినిమాలు
మాయా బజార్ (1957): తెలుగు సినిమా చరిత్రకు మకుటం వంటి చిత్రరాజంగా ఎప్పటికీ ఉండిపోతుంది మాయాబజార్ చిత్రం. కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని సమయంలో కూడా మాయాబజార్ లో గ్రాఫిక్స్ కనిపిస్తాయి. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. కీలుగుర్రం (1949): అక్కినేని నాగేశ్వర రావు, అంజలీ దేవి నటించిన ఈ సినిమా, మంచి అనుభూతిని అందిస్తుంది. తెలుగు నుండి తమిళంలోకి అనువాదమైన మొట్టమొదటి తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది. అవే కళ్ళు (1967): తెలుగులో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం ఇది. సూపర్ స్టార్ కృష్ణ, కాంచన హీరోహీరోయిన్లుగా కనిపించారు. ఏసీ తిరులోక చందర్ దర్శకత్వం వహించారు.