
Theatres bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్ లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది.
శనివారం ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కలిసి చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై సమాలోచనలు జరగ్గా, అనంతరం మీడియాతో ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మాట్లాడారు. థియేటర్ల బంద్‌పై వదంతులు వ్యాపించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
'బంద్ గురించి చర్చలు జరగకపోతే ఆ దిశగా అడుగులు పడతాయని మాత్రమే మేము చెప్పాం. కానీ థియేటర్ల బంద్ ఖాయం అనేలా ప్రచారం జరగడం తప్పు.
ఒక సినిమా నేపథ్యంలో థియేటర్లు బంద్ అవుతాయంటూ వార్తలు రావడం పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Details
సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేస్తాం
చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలున్నాయని, అవన్నీ పరస్పర సంబంధం కలిగినవేనని, వాటిని ఒకదానికొకటి కలపకుండా ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ముఖ్యంగా థియేటర్లలో పర్సంటేజీ విధానంపై గత కొన్నేళ్లుగా చర్చలు జరగలేదని, ప్రస్తుతం మాత్రం ఈ అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
మూడు వర్గాల నుంచి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈనెల 30న జరగనున్న సమావేశంలో ఆ కమిటీకి సభ్యులుగా ఎవరుంటారన్నది ఖరారు చేస్తాం.
వారి ఆధ్వర్యంలో రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసి, సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేస్తామని దామోదర ప్రసాద్ వివరించారు.
Details
ఇంటర్నల్ గా పరిష్కరించేందుకు కృషి
అలాగే మీడియా సభ్యులను ఉద్దేశించి థియేటర్ల బంద్ గురించి అనధికారిక వర్గాల సమాచారం ఆధారంగా వార్తలు రాయవద్దని, అధికారికంగా ఫిల్మ్ ఛాంబర్ నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని సూచించారు.
'చిత్ర పరిశ్రమలోని అన్ని వర్గాలతో సమావేశాలు జరిపి వీలైనన్ని సమస్యలను ఇంటర్నల్‌గా పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
మిగిలిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు జరపుతాం. ఈ క్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసే యోచనలో ఉన్నామని తెలిపారు.