
OG Review: రివ్యూ: ఓజస్ గంభీర విధ్వంసం.... పవన్‌కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎలా ఉంది?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది తెలుగు సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో ఒకటి 'ఓజీ'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామా శైలిలో రూపొందింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ పాత్రలో ఎలా కనిపించారు? ఆయన తెరమీద చూపించిన థ్రిల్ ఎంతవరకు అలరించిందన్నది ఆసక్తికర అంశం.
వివరాలు
కథ ఏమిటంటే…
కథా గమనాన్ని ఒక రాజు-యోధుడు నేపథ్యంతో ఆవిష్కరించారు. తన రాజును, రాజ్యాన్ని కాపాడే ఓ యోధుడు పదేళ్లపాటు దూరమవ్వడంతో, శత్రువులు చెలరేగి ఆ రాజ్యం మీద ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నిస్తారు. ఇబ్బందుల్లో పడిన రాజును రక్షించేందుకు తిరిగి వచ్చి శత్రువులపై యుద్ధం ప్రారంభించే యోధుడే ఓజీ. ఇక్కడ రాజు సత్యదాదా (ప్రకాశ్ రాజ్),ఆయనను కాపాడే యోధుడే పవన్ కళ్యాణ్ . ప్రతినాయకుడిగా ఓమి (ఇమ్రాన్ హష్మీ) ఆరంగేట్రం చేస్తాడు. కథలో ప్రధాన ప్రశ్నలు - ఓజీకి సమురాయ్ వంశానికీ సంబంధం ఏమిటి? ముంబై అండర్‌వరల్డ్ అతని పేరు విన్నప్పుడే ఎందుకు వణుకుతుంది? పదేళ్ల తర్వాత కూడా అదే భయాన్ని కలిగించగలిగాడా లేదా? ఇవన్నీ సినిమా చూసిన తర్వాతే స్పష్టమవుతాయి.
వివరాలు
సినిమా ఎలా ఉంది?
తాము ఆరాధించే కథానాయకుడి సినిమాలోని ప్రతి సన్నివేశం ఓ క్లైమాక్స్‌లా ఉండాలని ఆశపడతారు మెజార్టీ అభిమానులు. అదే ఆలోచనతో సుజీత్ ఈ చిత్రాన్ని తీశారని అనిపిస్తుంది.సినిమా మొత్తం ఫ్యాన్ బాయ్ మూమెంట్స్‌తో నిండిపోయింది. పవన్‌కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఆయుధాలతో,స్టైల్‌తో ఆయనను చూపించడమే కాకుండా, అద్భుతమైన ఎలివేషన్స్‌తో తెరపై సునామీలా చూపించారు. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ సన్నివేశాల్ని మరింత ఎత్తుకి తీసుకెళ్లింది. విజువల్స్,టెక్నికల్ విలువలు సినిమాకి బలమైన అదనపు బలం అయ్యాయి.అయితే సాధారణ ప్రేక్షకుల్ని మెప్పించాలంటే కథా బలం కూడా అవసరం. ఇక్కడ మాత్రం సుజీత్‌లోని అభిమాని,కథా నిర్మాణం కంటే స్టైల్,యాక్షన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టున్నారు. జపాన్ యకుజా,సమురాయ్ నేపథ్యంతో ప్రారంభమైన కథ,ఆ తర్వాత ముంబైలో సాగే ఎలివేషన్ సన్నివేశాలతో కొనసాగుతుంది.
వివరాలు
సినిమా ఎలా ఉంది?
మొదటి భాగంలో ప్రేక్షకుడిని కొత్త కథా లోకంలోకి తీసుకెళ్లి, ఓజీ గతం, ముంబై తిరిగొచ్చిన సందర్భం, యాక్షన్ సన్నివేశాలు అన్నీ బలంగా నడిపించాయి. ఇంటర్వెల్ తర్వాత పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచింది. కానీ తరువాతి భాగంలో అనవసర ఉపకథలు, కొంత గందరగోళంగా సాగే కథనం కాస్త నెమ్మదించాయి. సత్యదాదా-ఓజీ మధ్య తండ్రీకొడుకుల్లాంటి అనుబంధం, భావోద్వేగాలు మరింత లోతుగా చూపాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఎలివేషన్స్‌కి కట్టిపడిపోతూ ప్రేక్షకులు ఈ లోపాలను పెద్దగా పట్టించుకోరు. చివరి పతాక సన్నివేశాలు జానీ సినిమాని గుర్తు చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రగిలిస్తాయి.
వివరాలు
నటీనటులు ఎలా చేశారు?
సినిమా మొత్తాన్ని పవన్‌కల్యాణ్ వన్‌మాన్ షోగా చెప్పొచ్చు. ఆయన డైలాగులు తక్కువగా ఉన్నా, ఆయుధాలు, యాక్షన్ సన్నివేశాలే ఎక్కువగా మాట్లాడాయి. కటానా, నాంచాక్, గన్స్, కత్తులు - ఇవన్నీ ఆయన పాత్రకు చక్కగా సరిపోయాయి. ఇమ్రాన్ హష్మీ స్టైలిష్‌గా కనిపించినా, ఆయన పాత్రను ఇంకా బలంగా తీర్చిదిద్దితే బావుండేది. ప్రియాంక మోహన్ కణ్మని పాత్రలో అందంగా కనిపించింది కానీ స్క్రీన్ టైమ్ పరిమితమే. సత్యదాదాగా ప్రకాశ్ రాజ్, గీత పాత్రలో శ్రియారెడ్డి, జిమ్మీగా సుదేవ్ నాయర్, అభిమన్యు సింగ్ కీలకంగా చేశారు. జాకీ శ్రాఫ్, లాల్ తాత్కాలిక పాత్రలతో 'సాహో' సినిమాను గుర్తు తెచ్చారు.
వివరాలు
సాంకేతికంగా..
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ సినిమాకి పెద్ద బలమైంది. ముఖ్యంగా తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్లో ఊపును కలిగించింది. పాటలు కూడా ఆకట్టుకున్నాయి. రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస తీసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ పనితీరు మెప్పించాయి. సుజీత్ స్టైలిష్ మేకింగ్ సినిమాని మరో లెవెల్‌లో నిలబెట్టింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా కనబడాయి.
వివరాలు
బలాలు
+ పవన్‌కల్యాణ్ + హీరోయిజం, ఎలివేషన్స్, యాక్షన్ +, నేపథ్య సంగీతం.. విజువల్స్ బలహీనతలు: - ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు - ఆసక్తి రేకెత్తించని కథనం చివరిగా: ఓజీ... ఫ్యాన్స్ ఖుషీ మొత్తంగా 'ఓజి' సినిమా జపాన్, ముంబై బ్యాక్ డ్రాప్ లో ఫాదర్ ఎమోషన్ తో కూడిన ఓ గ్యాంగ్ స్టర్ కథ. పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇవ్వొచ్చు. గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!