Peddi: 'పెద్ది'లో అసలు మైనస్ ఇదే.. పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన 'పెద్ది' సినిమాపై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన యూట్యూబ్ కార్యక్రమం 'పరుచూరి పాఠాలు'లో సినిమా గురించి మాట్లాడిన ఆయన.. చిన్న పాయింట్‌తో కథను నడిపించిన విధానం ఆకట్టుకుందని, చివర్లో ఇచ్చిన సందేశం తనకు ఎంతో నచ్చిందని చెప్పారు.
వివరాలు
చిన్న పాయింట్‌తో మూడు గంటల సినిమా.. సాహసమే!
'ఒక ఊర్లో రైలు ఆగాలి అనే చిన్న పాయింట్ ఆధారంగా మూడు గంటలకు పైగా సినిమా తీయడం నిజంగా సాహసమే.
అయితే నిడివి విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.
ఈ సినిమాలో హీరోగా రామ్ చరణ్ కాకుండా మరెవరైనా నటించి ఉంటే ఇదే స్థాయి ఫలితం వచ్చేదా అన్న సందేహం నాకు ఉంది.
సినిమా మొత్తాన్ని చరణ్ తన భుజాలపై మోశాడు. ఈ సినిమాకు వసూళ్లు రావడానికి ప్రధాన కారణం కూడా అతడేనని పరుచూరి వ్యాఖ్యానించారు.
వివరాలు
జగపతిబాబు, రెహమాన్‌పై ప్రశంసలు
సినిమాలో జగపతిబాబు పోషించిన పాత్ర ఎంతో బలంగా ఉందని, ఆయన ఆ పాత్రలో ప్రాణం పెట్టి నటించారని పరుచూరి ప్రశంసించారు.
అలాగే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా సినిమాకు మంచి బలం చేకూర్చిందన్నారు.
కథలోని సందేశం ఆకట్టుకుంది
ఓట్లు కూడా లేని ఓ గ్రామంలో రైలు ఆగేలా చేయాలనే అంశాన్ని చాలా గొప్పగా రాశారు.
తన ఊరికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో హీరో ముందుగా క్రికెట్, కుస్తీ పోటీల్లో విఫలమైనా.. చివర్లో రన్నింగ్‌లో తన ప్రతిభను చాటుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు.
ఆ సందేశం చాలా బాగుందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
వేషధారణలు, హీరోయిన్ పాత్రపై అభిప్రాయం
సినిమాలో తనకు నచ్చని అంశాల గురించి కూడా పరుచూరి ప్రస్తావించారు. 'హీరో, హీరోయిన్ వేషధారణలు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అయ్యేలా లేవు.
బహుశా కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల తరహాలో చూపించాలనే ఉద్దేశంతో అలాంటి కాస్ట్యూమ్స్ ఎంచుకుని ఉండొచ్చని చెప్పారు.
అలాగే హీరోయిన్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉందని, ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
సినిమా నిడివిపై స్పందిస్తూ.. 'పెద్ది' రన్‌టైమ్‌ను మరో 30 నుంచి 40 నిమిషాలు తగ్గించి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది.
హీరోయిన్ పాత్రను కూడా మరింత విస్తరించి ఉంటే, ఓటీటీలో ఈ చిత్రాన్ని ఇంకా ఎక్కువ మంది ఆస్వాదించే అవకాశం ఉండేదని పరుచూరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.