Vijay Leo Cafe: 'లియో'లో విజయ్ కూర్చున్న కేఫ్ ఇదే.. ఇప్పుడు టూరిస్ట్ స్పాట్‌గా మారింది!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటుడు, తమిళనాడు సీఎం విజయ్ (Vijay) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'లియో' (Leo) చిత్రం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమాలో విజయ్ ఓ కేఫ్ యజమాని పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే సినిమాలో చూపించిన ఆ కేఫ్ కేవలం సినిమా కోసం వేసిన సెట్ కాదనే విషయం చాలామందికి తెలియదు. కశ్మీర్‌లో నిజంగానే ఉన్న కేఫ్‌లోనే 'లియో' చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో ప్రస్తుతం ఆ కేఫ్ దళపతి విజయ్ అభిమానులకు ప్రత్యేక పర్యాటక కేంద్రంగా మారిపోయింది. కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా ఖానబల్-పహల్గామ్ మార్గంలో ఉన్న 'సిఫార్ కేఫ్' (Sifar Cafe) ప్రస్తుతం పర్యాటకులతో కిటకిటలాడుతోంది.
వివరాలు
ఇదే కేఫ్ లో షూటింగ్
శ్రీనగర్‌కు సుమారు 60 కిలోమీటర్లు, పహల్గామ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో మత్తన్ సమీపంలో ఈ కేఫ్ ఉంది.
'లియో' సినిమాలో విజయ్ పోషించిన పార్థిబన్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలతో పాటు త్రిష (Trisha), సంజయ్ దత్ (Sanjay Dutt) పోషించిన ఆంటోనీ దాస్ పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను కూడా ఇదే కేఫ్‌లో చిత్రీకరించారు.
'లియో' సినిమా విడుదలైన తర్వాత ఈ కేఫ్‌కు వచ్చే విజయ్ అభిమానుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడికి వస్తున్న అభిమానులు కేవలం కేఫ్‌లో తినేసి వెళ్లడం లేదు.
సినిమాలో విజయ్ ఎంట్రీ సన్నివేశాన్ని రీక్రియేట్ చేస్తూ సందడి చేస్తున్నారు. సినిమాలో విజయ్ కూర్చున్న ప్రదేశంలో కూర్చొని ఫొటోలు దిగుతున్నారు.
వివరాలు
పర్యాటకులు నేరుగా ఇక్కడికే వస్తున్నారు
సినిమాలో పార్థిబన్ పాత్రకు సంబంధించిన 'హాట్ చాక్లెట్' వంటి వాటిని ప్రత్యేకంగా ఆర్డర్ చేస్తున్నారు. అభిమానుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకున్న కేఫ్ నిర్వాహకులు కూడా 'సిఫార్ కేఫ్'ను 'లియో' కేఫ్‌గా మార్చేశారు.
కేఫ్‌లో విజయ్ ఫొటోలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. దీంతో 'లియో' సినిమాలో కనిపించిన ప్రదేశాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునే దళపతి అభిమానులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఈ కేఫ్‌కు వస్తున్న పర్యాటకుల గురించి 'సిఫార్ కేఫ్' మేనేజర్ సబ్జర్ అహ్మద్ లోన్ సంతోషం వ్యక్తం చేశారు.
సినిమా విడుదలైనప్పటి నుంచి దక్షిణాది ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు నేరుగా తమ కేఫ్‌కు వస్తున్నారని తెలిపారు.
వివరాలు
25 రోజుల పాటు అక్కడే
'లియో' షూటింగ్ సమయంలో విజయ్ దాదాపు 25 రోజుల పాటు అక్కడే ఉన్నారని చెప్పారు. షూటింగ్ సమయంలో విజయ్ ప్రతిరోజూ తమ సిబ్బందిని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని సబ్జర్ అహ్మద్ లోన్ గుర్తుచేసుకున్నారు.
అప్పట్లో విజయ్‌కు ఉన్న క్రేజ్ తమకు పూర్తిగా తెలియదని తెలిపారు. అయితే ఆయన తమ కేఫ్‌లో షూటింగ్ చేయడం ఇప్పుడు వరంలా మారిందని పేర్కొన్నారు.
ఒకప్పుడు సాధారణ కేఫ్‌గా ఉన్న తమ ప్రదేశం.. 'లియో' సినిమా తర్వాత టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయిందని సబ్జర్ అహ్మద్ లోన్ హర్షం వ్యక్తం చేశారు.
విజయ్ నటించిన 'లియో' సినిమాతో తమ కేఫ్‌కు ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు దక్షిణాది పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుండటంతో కేఫ్ ప్రస్తుతం సందడిగా మారింది.