తొలిప్రేమ రీ రిలీజ్: థియేటర్లో పెద్ద గొడవ; స్క్రీన్ చించేసిన ఆకతాయిలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన తొలిప్రేమ చిత్రం 25ఏళ్ల క్రితం రిలీజై తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. తెలుగు సినిమాలోని ప్రేమకథలో క్లాసిక్‌గా తొలిప్రేమ చిత్రం నిలుస్తుంది. తొలిప్రేమ రిలీజై 25ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆ సినిమాను జూన్ 30వ తేదీన మళ్ళీ విడుదల చేసారు. 4కే రిజల్యూషన్‌తో థియేటర్లలో రిలీజైన తొలిప్రేమ సినిమాకు అభిమానులు పోటెత్తారు. అయితే తాజాగా తొలిప్రేమ రీ రిలీజ్ అయిన థియేటర్లో కొందరు ఆకతాయిలు గొడవ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
పవన్ అభిమానులా? అభిమానుల రూపంలో ఆకతాయిలా?
విజయవాడలోని కపర్థి థియేటర్లో సెకండ్ షో సమయంలో తొలిప్రేమ ప్రదర్శన జరుగుతున్న సమయంలో కొందరు ఆకతాయిలు గొడవ సృష్టించారు. కూర్చున్న చోటి నుండి పదిమంచి లేచి స్క్రీన్ వద్దకు చేరుకుని స్క్రీన్ ని చించేసి నానా హంగామా చేసారు ఈ గొడవ కారణంగా థియేటర్ యాజమాన్యానికి 6లక్షల నష్టం వచ్చిందని అంటున్నారు. గొడవ చేసింది పవన్ కళ్యాణ్ అభిమానులా? లేక అభిమానుల ముసుగులో వేరే ఎవరైనా కావాలనే ఇలా చేసారా? అన్నది తెలియాల్సి ఉందని థియేటర్ యాజమాన్యం చెబుతోంది. ఈ విషయమై పోలీసు విచారణ జరగాలని థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు.