Loading...
Tushar Kapoor: బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు బెదిరింపు కాల్.. రూ.5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్!
బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు బెదిరింపు కాల్.. రూ.5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్!

Tushar Kapoor: బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు బెదిరింపు కాల్.. రూ.5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2026
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు రూ.5 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినని చెప్పుకున్న ఓ ఆగంతుకుడు ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు.. ఇది నిజంగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చిన కాల్ కాకపోవచ్చని అనుమానిస్తున్నారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి గొంతు, గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకుంటున్న హ్యారీ బాక్సర్ అసలు వాయిస్ శాంపిల్స్‌తో సరిపోలకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. తుషార్ కపూర్‌కు ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 'హ్యారీ బాక్సర్' అని పరిచయం చేసుకున్నాడు.

వివరాలు

వాయిస్ శాంపిల్స్‌లో తేడా.. ఫేక్ కాల్‌గా అనుమానం

అనంతరం రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగాడు. దీంతో అప్రమత్తమైన తుషార్ కపూర్ వెంటనే ముంబై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. విచారణ బాధ్యతలను యాంటీ ఎక్స్టార్షన్ సెల్, క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ టెక్నికల్ టీమ్ బెదిరింపు కాల్ ఆడియో రికార్డింగ్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది.

ఆ కాల్‌లో మాట్లాడిన వ్యక్తి గొంతును తమ వద్ద అందుబాటులో ఉన్న హ్యారీ బాక్సర్ అసలు వాయిస్ శాంపిల్స్‌తో పోల్చి చూసింది.

అయితే ఈ రెండు ఆడియో శాంపిల్స్ మధ్య ఎలాంటి పోలిక లేదని సీనియర్ పోలీసు వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.

వివరాలు

డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్

ఇతర ఆడియో శాంపిల్స్‌తో పోల్చి పరిశీలించినప్పటికీ ఫలితంలో మార్పు కనిపించలేదని తెలుస్తోంది.

దీంతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును ఉపయోగించుకుని తుషార్ కపూర్‌ను భయపెట్టి డబ్బులు వసూలు చేసేందుకు ఎవరో ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

గ్యాంగ్‌తో సంబంధం లేని వ్యక్తి, ఆ పేరును అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడి ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని ముంబైలో కాల్పుల ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ దాడికి కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ADVERTISEMENT

వివరాలు

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన తర్వాత బెదిరింపు కాల్

ఈ ఘటన తర్వాతే తుషార్ కపూర్‌కు రూ.5 కోట్ల బెదిరింపు కాల్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్‌లో భయాందోళనలు సృష్టించి, సులభంగా డబ్బు సంపాదించేందుకు కొందరు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును ఉపయోగించుకుంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

గ్యాంగ్ పేరు చెబితే సెలబ్రిటీలు భయపడి డబ్బులు చెల్లిస్తారనే ఉద్దేశంతో ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.

బెదిరింపు కాల్ చేసిన ఆగంతుకుడు ఎవరు? అతడు ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు? అనే వివరాలను గుర్తించేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తును ముమ్మరం చేసింది.

కాల్ మూలాన్ని ట్రేస్ చేయడంతో పాటు నిందితుడిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ADVERTISEMENT