పరేషాన్ టీజర్ టాక్: మనిషికి నీళ్ళు, అన్నం ఎట్లనో మందు కూడా గట్లనే
మసూద సినిమాతో మాంచి హిట్ అందుకున్న హీరో తిరువీర్, ఈసారి పరేషాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పరేషాన్ టీజర్ ఈరోజే విడుదలైంది. మనిషికి నీళ్ళు, అన్నం ఎట్లనో మందు కూడా అంతే అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఈ ఒక్క మాట టీజర్ మొత్తాన్ని నిర్వచిస్తుందనే చెప్పాలి. హీరోకి మందు తాగే అలవాటు చాలా ఎక్కువనీ, ఆ ఊరిలోని జనాలందరూ మందు అంటే పడి ఛస్తారనీ, మందు లేకపోతే ధర్నాలకు దిగుతారనీ టీజర్ లో చూపించారు. సినిమా పేరులాగే టీజన్ మొత్తం పరేషాన్లతో నిండిపోయింది. ఏ పని లేకుండా తినీ తాగి ఇంట్లో కూర్చునే హీరోలా తిరువీర్ కనిపించాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సినిమా సాగుతుందని టీజర్ చూస్తే తెలిసిపోయింది.
రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరేషాన్
పరేషాన్ టీజర్ లో లవ్ కూడా కనిపించింది. కాకపోతే అదెంతవరకు ఉందనేది ట్రైలర్ రిలీజ్ అయితే గానీ పూర్తిగా అర్థం కాదు. ప్రస్తుతానికి పనీ పాట లేని మందు తాగే అలవాటున్న కుర్రాడి కథగా పరేషాన్ గురించి చెప్పుకోవచ్చు. ఇలాంటి కథలు తెలుగు తెర మీద చాలా వచ్చాయి. కాకపోతే తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో కొత్తగా వస్తున్నట్టుగా పరేషాన్ కనిపిస్తోంది. పరేషాన్ మూవీలో తిరువీర్ కి జోడీగా, పావని నటిస్తుంది. వాల్తేరు ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందుతున్న పరేషాన్ మూవీని రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సిద్ధార్థ్ రాళ్ళపల్లి నిర్మాతగా ఉన్నారు. అసోసియేట్ ప్రొడ్యూసర్ గా విశ్వదేవ్ రాచకొండ ఉన్నారు.