94ఏళ్ళ వయసులో టైటానిక్ యాక్టర్ లెవ్ పాల్టర్ కన్నుమూత
జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుతం టైటానిక్ సినిమా గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. అయితే టైటానిక్ సినిమాలో ఇసిడోర్ స్ట్రాస్ పాత్రలో నటించిన లెవ్ పాల్టర్ మరణించారు. 94ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా మే 21వ తేదీన లాస్ ఏంజిల్స్ లో లెవ్ పాల్టర్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని లెవ్ పాల్టర్ కూతురు, క్యాథరిన్ పాల్టర్ కన్ఫామ్ చేసారు. టైటానిక్ సినిమాలో ధనవంతుడిగా కనిపించిన పాల్టర్ పాత్ర, లైఫ్ బోటులోకి ఎక్కనని చెబుతుంది. తనకంటే ముందు పిల్లలు, మహిళలను లైఫ్ బోటులోకి ఎక్కిస్తుంది. టైటానిక్ కాకుండా లెవ్ పాల్టర్ నటించిన కొన్ని గొప్ప సినిమాల్లో 1981లో ఫస్ట్ మండే, హిల్ స్ట్రీట్ బ్లూస్ చిత్రాలు ఉన్నాయి.
లెవ్ పాల్టర్ మరణంపై కాల్ ఆర్ట్స్ స్కూల్ సంతాపం
నటుడిగా సినిమాల్లోకి రాకముందు కాల్ ఆర్ట్స్ యాక్టింగ్ స్కూల్ లో యాక్టింగ్ టీచర్ గా పనిచేసారు లెవ్ పాల్టర్. పాల్టర్ మరణంపై కాల్ ఆర్ట్స్ స్కూల్ సంతాపం తెలియజేసింది. పాల్టర్ కు నటన అంటే చాలా ఇష్టమని, స్టూడెంట్స్ కూడా నటనను ఇష్టపడేలా తయారు చేసేవాడని కాల్ ఆర్ట్స్ ప్రకటించింది. 1928 నవంబర్ 3వ తేదీన జన్మించిన పాల్టర్, టఫ్ట్స్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తిచేసారు. ఆ తర్వాత అల్ఫ్రెడ్ యూనివర్సిటీ నుండి పీజీ పూర్తి చేసి, నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నుండి పీ హెచ్ డీ పూర్తి చేసారు.