టాలీవుడ్: పరువు నష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన జీవిత, రాజశేఖర్ దంతులకు ఏడాది జైలు శిక్ష పడింది. 12ఏళ్ళ క్రితం నాటి కేసులో ఇప్పుడు శిక్ష పడటం చెప్పుకోవాల్సిన విషయం . చిరంజీవిపై చేసిన ఆరోపణలకు గాను, నాంపల్లిలోని 17వ అడిషనల్ ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు, జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష, 5వేల జరిమానా విధించింది. 2011లో జీవిత, రాజశేఖర్ దంపతులు చిరంజీవి బ్లడ్ బ్యాంకుపై ఆరోపణలు చేసారు. రక్తాన్ని అమ్ముకుని వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు చేసారు.
జరిమానా చెల్లించిన జీవిత, రాజశేఖర్ దంపతులు
ఈ ఆరోపణలను సవాల్ చేస్తూ, జీవిత, రాజశేఖర్ దంపతులపై చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పరువు నష్టం కేసు ఫైల్ వేసారు. ఈ కేసులో 12ఏళ్ల పాటు విచారణ సాగింది. చివరకు నిన్న (మంగళవారం రోజున) జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష, 5వేల జరిమానా విధించింది కోర్టు. జీవిత, రాజశేఖర్ దంపతులు 5వేల జరిమానా చెల్లించారు. అలాగే ఈ కేసు విషయంలో అప్పీలుకు అనుమతిస్తూ బెయిల్ మంజూరు చేసింది. అదలా ఉంచితే, రాజశేఖర్ ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. ఆయన కూతుళ్ళు శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మాత్రం సినిమాలతో బిజీగా ఉన్నారు.