LOADING...
Tollywood: టాలీవుడ్ మహానటుడికి చివరి వీడ్కోలు కూడా దక్కలేదు.. అంత్యక్రియలకు స్టార్ హీరోల గైర్హాజరు

Tollywood: టాలీవుడ్ మహానటుడికి చివరి వీడ్కోలు కూడా దక్కలేదు.. అంత్యక్రియలకు స్టార్ హీరోల గైర్హాజరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సినీ చరిత్రలో రావు గోపాల్ రావు పేరు కేవలం విలక్షణ నటుడిగానే కాకుండా, ఒక విశిష్ట వ్యక్తిత్వంగా చిరస్థాయిగా నిలిచింది. విలన్ పాత్రలకు ఆయన తీసుకొచ్చిన ప్రత్యేక శైలి ఆయనను ఇతరుల నుంచి భిన్నంగా నిలబెట్టింది. హీరోలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఆయనకు అభిమాన వర్గం ఉండేది. గతంలో ఆయన భార్య, ప్రముఖ హరికథా కళాకారిణి కమలా కుమారి ఒక ఇంటర్వ్యూలో వారి జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పీఠాపురంలో వారి పరిచయం ప్రారంభమైందని ఆమె తెలిపారు. హరికథ చెప్పడానికి వచ్చిన కమలా కుమారిని, నాటకాల్లో పాల్గొనాలని రావు గోపాల్ రావు శిష్యుడు ఆహ్వానించాడట.

వివరాలు

పురాణాలపై వ్యతిరేక అభిప్రాయం ఉండేది

ఆ సమయంలో రావు గోపాల్ రావుకు పురాణాలపై వ్యతిరేక అభిప్రాయం ఉండేది. అయితే కాలానుగుణంగా పురాణాలను చెప్పే కమలా కుమారి శైలి ఆయనను ఆకట్టుకుంది. ఆమె హరికథలు విని ఆయన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందట. ఆమె ప్రదర్శనలకు హాజరవుతూ, ఆధునిక సాహిత్యంపై వివరాలు చెప్పి, వాటిని హరికథల్లో చేర్చాలని ప్రోత్సహించేవారట. ఈ పరిచయం క్రమంగా స్నేహంగా మారి, రాజమండ్రిలో జరిగిన ఒక కార్యక్రమంలో స్నేహితుల సూచనతో పెళ్లి బంధంగా మారింది. ప్రత్యేకత ఏమిటంటే, వారి వివాహం కేవలం క్షణాల్లో అక్కడికక్కడే జరిగినట్లు కమలా కుమారి గుర్తు చేసుకున్నారు.

వివరాలు

11 ఏళ్లనే ఇంటిని విడిచారు

రావు గోపాల్ రావు వ్యక్తిత్వం తన అంచనాలకు మించినదిగా ఉందని కమలా కుమారి చెప్పారు. చిన్న వయసులోనే అంటే 11 ఏళ్లకే సమాజ సేవ కోసం ఇంటిని విడిచి వెళ్లిపోయారని ఆమె తెలిపారు. నాటకాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా భావించిన ఆయన, మూఢాచారాలు, అంధ విశ్వాసాలపై నాటకాలు రచించి, దర్శకత్వం వహించి, నటించారు. అనేక నాటక అకాడెమీలను స్థాపించి, వెయ్యికి పైగా శిష్యులను తన కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. సినిమాల్లోకి రావడం ఆయనకు మొదటి ఎంపిక కాదు. నటుడు ఎస్వీ రంగారావు, దర్శకుడు రావి నీడు గార్లకు సన్మానం నిర్వహించే సందర్భంగా 'కీర్తిశేషులు' నాటకం ప్రదర్శించినప్పుడు, రావు గోపాల్ రావు ప్రతిభ వారిని ఆకట్టుకుంది.

Advertisement

వివరాలు

ఎస్వీఆర్ పట్ల ఆపార గౌరవం

'భక్త పోతన' సినిమాలో శ్రీనాథుడు పాత్రకు ఎస్వీఆర్ చేసిన సూచనతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. దర్శకత్వంపై ఆసక్తి ఉన్నా, నటనపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, ఎస్వీఆర్ పట్ల ఉన్న గౌరవంతో ఆ పాత్రను అంగీకరించారు. ఆ తర్వాత ఆయన నటుడిగా అగ్రస్థాయికి ఎదిగి, ఎవరికీ అందని స్థాయిని అందుకున్నారు. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆయన ఒక హీరో. ఎవరి గురించి చెడుగా మాట్లాడడం ఆయనకు అలవాటు కాదు. ఇంటికి వచ్చిన వారిని ఎప్పుడూ ఆతిథ్యంతో పంపేవారు. వంద మందికి వండి పెట్టిన రోజులు కూడా ఉన్నాయని కమలా కుమారి పేర్కొన్నారు.

Advertisement

వివరాలు

నిరంతరం షూటింగ్ తో ఆరోగ్య సమస్యలు

అయితే నిరంతర షూటింగ్‌లు, రాజకీయ కార్యకలాపాల వల్ల నిద్రలేమి, సరైన ఆహారం లేకపోవడం ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. మధుమేహం కారణంగా కిడ్నీలు దెబ్బతిన్నాయి. ధూమపానం కూడా పరిస్థితిని మరింత విషమం చేసింది. 1994 ఆగస్టు 13న, 57 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. చివరి రోజుల్లో ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కమలా కుమారి తెలిపారు. నమ్మినవారి చేతిలో ఆస్తులు కోల్పోయి, చికిత్సకు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చిందట. చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బుతో వైద్యం చేయించుకున్నా ప్రయోజనం లేకపోయింది. అంతటి మహానటుడి అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో లేదా ప్రముఖ నిర్మాత హాజరు కాకపోవడం బాధాకరమని ఆమె అన్నారు.

వివరాలు

సరైన గౌరవం దక్కలేదు

అల్లు రామలింగయ్య, పి.ఎల్. నారాయణ, రేలంగి, జై కృష్ణ వంటి కొద్దిమంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారని తెలిపారు. ఆ సమయంలో తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు మారుతున్న దశలో ఉండటం, అంత్యక్రియలు చెన్నైలో జరగడం కూడా దీనికి కారణమై ఉండొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఒక లెజెండ్‌కు దక్కాల్సిన గౌరవం ఇది కాదని ఆయన సన్నిహితులు నేటికీ విచారం వ్యక్తం చేస్తున్నారు. రావు గోపాల్ రావు వారసత్వాన్ని ఆయన కుమారుడు రావు రమేష్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగు చిత్రసీమలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement