Ustad Bhagat Singh:ధురంధర్ 2 నుంచి గట్టి పోటీ.. అయినా తగ్గని పవన్ మేనియా.. ఉస్తాద్ 5 రోజుల కలెక్షన్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
బాక్సాఫీస్ వద్ద పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉండటం సహజమే. అయితే కొన్ని సందర్భాల్లో అది పూర్తిగా ఏకపక్షంగా మారి ఇతర సినిమాలపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' పరిస్థితి అలాంటిదిగానే కనిపిస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' సృష్టించిన బాక్సాఫీస్ సునామీ కారణంగా పవన్ సినిమా వసూళ్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దూకుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తూ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోతోంది.
వివరాలు
ఐదో రోజు వసూళ్లు
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సోమవారం (మార్చి 23) విడుదలైన ఐదో రోజు 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇండియాలో కేవలం రూ. 1.96కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే నమోదు చేసింది. విడుదల తర్వాత ఇదే కనిష్ట సింగిల్ డే వసూళ్లు కావడం గమనార్హం. మొత్తం ఐదు రోజుల్లో ఈ సినిమా ఇండియాలో రూ. 62.26 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఇంత భారీ పోటీ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మేనియా తగ్గలేదని అభిమానులు అంటున్నారు. ఐదో రోజున కూడా సుమారు రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్స్ రావడం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. 'ధురంధర్ 2'హవా ఎంత గట్టిగా ఉన్నా, 'ఉస్తాద్ భగత్ సింగ్'కు ఉన్న క్రేజ్ కూడా తగ్గలేదని వారు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
'ధురంధర్ 2' దూకుడు
ఇక ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్ 2' మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. సోమవారం రోజునే ఈ చిత్రం రూ. 65 కోట్ల వసూళ్లు సాధించి, మొత్తం రూ. 519 కోట్ల మార్క్‌ను దాటింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ హిందీ సినిమా హౌస్‌ఫుల్ షోలతో కొనసాగుతోంది. కేజీఎఫ్: చాప్టర్ 2, బాహుబలి 2 వంటి భారీ చిత్రాల రికార్డులను కూడా అధిగమించడం విశేషం.
వివరాలు
దర్శకుడు స్పందన
ఈ భారీ పోటీపై దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే స్పందించారు. "పెద్ద సినిమాల మధ్య పోటీ అనేది నా చేతుల్లో ఉండే నిర్ణయం కాదు. పవన్ సార్‌తో చాలా కాలం తర్వాత సినిమా చేస్తున్నాను. ఇలాంటి సమయంలో మరో పెద్ద సినిమాతో పోటీ పడటం కాస్త ఆందోళన కలిగించే విషయం. అయితే సంక్రాంతి, సమ్మర్ సీజన్లలో రెండు మూడు పెద్ద సినిమాలు ఒకేసారి ఆడేంత స్పేస్ మార్కెట్‌లో ఉందని నమ్ముతున్నానని తెలిపారు.
వివరాలు
సినిమా నేపథ్యం
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' 2016లో వచ్చిన విజయ్ నటించిన 'తేరి'కి రీమేక్ అనే టాక్ ఉంది. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించగా, సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్, ఎస్.ఎస్. థమన్ అందించారు. అయితే ప్రస్తుతం 'ధురంధర్ 2' ప్రభంజనం కొనసాగుతున్న నేపథ్యంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' తిరిగి పుంజుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.