Loading...
Toxic OTT Deal: రూ.30 కోట్లకే 'టాక్సిక్' ఓటీటీ డీల్? యష్ సినిమాకు ఇంత తక్కువ ఆఫరా!
రూ.30 కోట్లకే 'టాక్సిక్' ఓటీటీ డీల్? యష్ సినిమాకు ఇంత తక్కువ ఆఫరా!

Toxic OTT Deal: రూ.30 కోట్లకే 'టాక్సిక్' ఓటీటీ డీల్? యష్ సినిమాకు ఇంత తక్కువ ఆఫరా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 10, 2026
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ 'టాక్సిక్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందనే ప్రచారం జరుగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం యష్ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.340 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం. సినిమా విడుదలై నెల రోజులు దాటినా ఇప్పటివరకు ఓటిటిలోకి రాకపోవడం ఆసక్తికరంగా మారింది. థియేటర్లలో వచ్చిన స్పందన నేపథ్యంలో ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కొనుగోలుపై వెనకడుగు వేస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో 'టాక్సిక్' ఓటీటీ డీల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది.

వివరాలు

రూ.200 కోట్లు ఆశించిన యష్.. ఇప్పుడు రూ.30 కోట్ల ఆఫరేనా?

'టాక్సిక్' డిజిటల్ హక్కుల కోసం గతంలో ఓటీటీ సంస్థలు సుమారు రూ.150 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది.

అయితే ఆ ఆఫర్‌ను యష్ తిరస్కరించడంతో పాటు, ఓటీటీ హక్కుల కోసం ఏకంగా రూ.200 కోట్లు ఆశించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ సినిమా డిజిటల్ హక్కుల డీల్‌పై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం ఓటీటీ సంస్థ నుంచి 'టాక్సిక్'కు కేవలం రూ.30 కోట్ల ఆఫర్ మాత్రమే వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా ఈ మొత్తంలోనూ 50 శాతం మాత్రమే ముందస్తుగా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని పే-పర్-వ్యూ (Pay-per-view) విధానంలో చెల్లించనున్నట్లు సమాచారం.

వివరాలు

అధికారిక ప్రకటన మాత్రం లేదు

అయితే ఈ డీల్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. గతంలో 'టాక్సిక్' సినిమా ఓటీటీ హక్కులను జీ5 (ZEE5) సొంతం చేసుకుందని వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయంపై చిత్ర బృందం కానీ, సదరు ఓటీటీ సంస్థ కానీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో సినిమా డిజిటల్ హక్కులు ఏ సంస్థకు దక్కనున్నాయన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు.

థియేటర్లలో సినిమాకు వచ్చిన స్పందన డిజిటల్ హక్కుల డీల్‌పై ప్రభావం చూపుతోందనే ప్రచారం ప్రస్తుతం కొనసాగుతోంది.

గతంలో రూ.200 కోట్ల వరకు ఆశించిన ఓటీటీ హక్కుల ధర ఇప్పుడు రూ.30 కోట్లకు పడిపోయిందన్న వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారమే తప్ప, అధికారికంగా నిర్ధారణ కాలేదు.

ADVERTISEMENT