Ananya Raj: సినీ పరిశ్రమలో విషాదం.. యువ నటి అనన్య రాజ్ ఇకలేరు
ఈ వార్తాకథనం ఏంటి
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి, మోడల్ అనన్య రాజ్ (27) కన్నుమూశారు. అయితే ఆమె జులై 15వ తేదీనే మృతి చెందగా.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు దాదాపు నెల రోజుల పాటు గోప్యంగా ఉంచారు. ఆగస్టు 16న ఆమె కుటుంబం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. అనన్య మరణవార్త ఆలస్యంగా బయటకు రావడంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అనన్య రాజ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కుటుంబ సభ్యులు ఓ సుదీర్ఘమైన, భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. 'చాలా బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. మా ప్రియమైన అనన్య జులై 15న తెల్లవారుజామున నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూసింది.
వివరాలు
మోడలింగ్ నుంచి సినిమాల్లోకి..
గతేడాదిగా ఆమె తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడింది.
ఒక యోధురాలిలా ఎంతో ధైర్యంగా నిలబడింది. ఈ కష్ట సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించండి అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ముంబైలో పుట్టి పెరిగిన అనన్య రాజ్ మోడలింగ్ రంగం ద్వారా కెరీర్ ప్రారంభించి అనంతరం సినిమాల్లోకి అడుగుపెట్టారు.
2016లో విడుదలైన '7 అవర్స్ టు గో' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'ది ఫైనల్ ఎగ్జిట్', కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన 'ఘోస్ట్' వంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు.
వివరాలు
తెలుగులోనూ నటించిన అనన్య
తెలుగు ప్రేక్షకులకు కూడా అనన్య రాజ్ పరిచయమే. నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'తగ్గేదే లే' (2022)లో ఆమె నటించారు.
అలాగే 'మద్రాసీ గ్యాంగ్' సినిమాలోనూ కనిపించారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ఆమెకు గుర్తింపు వచ్చింది. కేవలం 27 ఏళ్ల వయసులోనే అనన్య రాజ్ మృతి చెందడం సినీ వర్గాలను కలచివేసింది.
అంతేకాకుండా ఆమె మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులు దాదాపు నెల రోజుల తర్వాత వెల్లడించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
అనన్య మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.