
Kota Srinivasa Rao: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కన్నుమూశారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోటా, 1978లో 'ప్రాణం ఖరీదు' సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 750కు పైగా చిత్రాల్లో ఆయన తన నటనను ప్రదర్శించారు.
Details
హైదరాబాద్‌లో అంతిమ యాత్ర
కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆయన మనవడు శ్రీనివాస్ నిర్వహించనున్నాడు. కోట కుమారుడు ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ప్రసాద్‌కు ఇద్దరు కుమారులు - పెద్దవాడు శ్రీనివాస్, చిన్నవాడు హర్ష్.
Details
నటనా జీవితం ఇదే
ఒక తండ్రి పాత్ర నుంచి తాత పాత్ర దాకా, విలన్‌గా నుంచి హాస్యనటుడిగా, నిస్సహాయుడిగా నుంచి క్రూరుడిగా - ఎలాంటి పాత్ర అయినా ఆవిష్కరించడంలో కోటా ఓ అద్భుతమైన ప్రతిభావంతుడు. ఆయన వేసిన ప్రతీ వేషానికీ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. విభిన్న పాత్రలను ఆవలీలగా పోషిస్తూ, తనకంటూ ప్రత్యేక స్థాయిని ఏర్పరచుకున్న నటుడు కోటా శ్రీనివాసరావు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పాత్రలు, పాత్రల రకాలు ఒక విశేష అధ్యాయంగా నిలిచిపోతాయి. సినిమాల్లో ఆయన పోషించని పాత్రలు, పండించని భావాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. ఇలా వెండితెరపై వైవిధ్యభరితమైన పాత్రలతో తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన కోటా, తన సినీ ప్రయాణాన్ని ముగించారు.
Details
సినీ రంగ ప్రవేశం వెనుక కథ
కోటా తొలి సినిమా అవకాశం ఎలా వచ్చిందంటే - 'ప్రాణం ఖరీదు' (1978) సినిమాలో రావు గోపాలరావు ప్రధాన పాత్ర కోసం ఎంపికయ్యారు. ఇదివరకే అదే పేరుతో మిమ్మల్ని నాటకం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఆ నాటకంలో కోటా శ్రీనివాసరావు కూడా నటించారు. ఆ ప్రదర్శనను నిర్మాత వాసు, దర్శకుడు క్రాంతి కుమార్ చూసి సినిమాగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆ నాటక రచయిత సీ.ఎస్.రావుకి కోటాపై ప్రత్యేక సెంటిమెంట్ ఉండేది. అందుకే సినిమాలో ఉన్న చిన్న పాత్ర కోసం కోటాను కోరారు. అలా ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది.