Raghunath Reddy: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రఘునాథ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతితో సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. తెలుగు చిత్రసీమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న రఘునాథ్ రెడ్డి, నెగటివ్ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. దాదాపు 370కు పైగా సినిమాల్లో నటించి తన విశేష నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, భోజ్‌పురి భాషల చిత్రాల్లోనూ నటించి బహుభాషా నటుడిగా గుర్తింపు పొందారు.
Details
టెలివిజన్ సీరియల్స్‌లో నటించిన అనుభవం
సినిమాల్లో మాత్రమే కాకుండా టెలివిజన్ సీరియల్స్‌లో కూడా ఆయన నటనకు మంచి పేరు ఉంది. రఘునాథ్ రెడ్డి మృతితో సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్త తెలియగానే పలువురు ప్రముఖ నటీనటులు, సినీ పెద్దలు సంతాపం తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా, గత కొన్ని నెలల క్రితమే రఘునాథ్ రెడ్డి కుమారుడు కూడా గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక రఘునాథ్ రెడ్డి మానసికంగా తీవ్రంగా కుంగిపోయినట్లు సమాచారం.
Details
సంతాపం వ్యక్తం చేస్తున్న ప్రముఖులు
ఆ లోతైన మానసిక వేదన మధ్యలోనే ఆయన కూడా గుండెపోటుకు గురై కన్నుమూయడం మరింత విషాదాన్ని మిగిల్చింది. కొద్ది నెలల వ్యవధిలోనే కుమారుడు, తండ్రి ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. శోభన్ బాబు నటించిన 'సర్పయాగం' సినిమాతో నటుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన రఘునాథ్ రెడ్డి, ఆ తర్వాత అనేక చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ఆయన మరణ వార్త తెలియడంతో సినీ వర్గాలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాయి.