Trivikram Srinivas: చిన్న చిన్న పదాలతో అద్భుతమైన సంభాషణలు రాయగలిగే సత్తా కలిగిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ !
మాటల రచయితలు అంటే.. వారి మాటలను కొత్తగా సృష్టించాలా?.. లేక ఆ మాటలను మరింత గుర్తుండిపోయేలా మార్చాలా?.. అంటే ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటేనే వారిని మాటల మాంత్రికులు అనవచ్చు. అలాంటి మాటల మాంత్రికుడు, తనదైన భాషా శైలితో, అక్షరాలకు ప్రాణం గలిగిన రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ఈ రోజు (నవంబర్ 7) త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
డైరెక్టర్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు
త్రివిక్రమ్ శ్రీనివాస్, మాటల మాంత్రికుడు, తన డైలాగ్స్ తో సినిమాలను పెద్ద హిట్ చేయగలిగిన ప్రతిభావంతుడు. హీరోలకే కాకుండా డైరెక్టర్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటారనే తెలిపిన జ్ఞాని. తన సినిమాల్లో కథకి ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, డైలాగ్ రైటింగ్ లోని గొప్పతనం గురించి కూడా చాటగలిగిన అపార మేధావి. అందరూ త్రివిక్రమ్ గారిని గౌరవంగా గురూజీ అని పిలవడం జరుగుతుంది, కానీ నిజానికి ఆయన గురువుగా ఒకరికి కాదూ.. ఆయన మాటలను విని వాటిని పాటించే ప్రతి ఒక్కరికి గురువే. కొత్తగా మాటలు ఎవరు పుట్టించగలరు. ఎవరో మాట్లాడితేనే కదా..మనం మాట్లాడుకునేది..ఆ తర్వాత వాటిని అందంగా అల్లుకునేది అంటాడు త్రివిక్రమ్.
సాహిత్యం పై ఉండే ఆసక్తితో సినిమాల్లోకి..
భీమవరంలో జన్మించి, న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం.ఎస్.సి పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించిన ఆయన విద్యలో అభిరుచి చూపించినప్పటికీ, సినిమాల వైపు ఆకర్షితులయ్యారు. ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసినా, సాహిత్యం పై ఉండే ఆసక్తితో సినిమాల్లోకి అడుగుపెట్టారు. వేణు హీరోగా వచ్చిన "స్వయం వరం" చిత్రంతో తన డైలాగ్ రచయితగా ఎంట్రీ ఇచ్చి, తన మాటలతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. కుటుంబ విలువలు,సంబంధాలు,ఆలోచింపజేసే మాటలు,అద్భుతమైన దృశ్యాలతో సినిమాల్లో సరికొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించిన త్రివిక్రమ్,సినీ వేదికలపై మాట్లాడితే,కూడా అదే క్రేజ్ ఉంటుంది. భవిష్యత్తులో ఆయన మరెన్నో మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలని,మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ 'తెలుగు న్యూస్ బైట్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. హ్యాపీ బర్త్ డే త్రివిక్రమ్ శ్రీనివాస్...!