Korean Kanakaraju: ఒకే శరీరంలో రెండు ఆత్మలు.. వరుణ్ తేజ్ హారర్ కామెడీ ట్విస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన 'కొరియన్ కనకరాజు' సినిమాపై చిత్రబృందం భారీ అంచనాలు వ్యక్తం చేస్తోంది. ఈసినిమా చేయడం నటుడిగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని వరుణ్ తేజ్ తెలిపారు. అన్ని వాణిజ్య అంశాలు ఎంతో సహజంగా కథలో మిళితమయ్యాయని, ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా, సత్య కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం హీరో రామ్‌చరణ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
వివరాలు
హారర్, కామెడీ మేళవింపుగా ట్రైలర్
'రక్తసిక్త పిశాచ కొరియన్ కనకరాజు దెయ్యం ఆవాహయామి' అంటూ సత్య చేసే క్షుద్ర పూజతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం హారర్, కామెడీ అంశాల మేళవింపుగా సాగింది.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పెనుకొండకు చెందిన కనకరాజు పాత్రలో కనిపించనున్నారు.
అయితే అతనికి ఓ కొరియన్ అండర్‌వరల్డ్ డాన్‌తో ఉన్న సంబంధం ఏమిటి?, ఆ డాన్ ఆత్మ కనకరాజు శరీరంలోకి ఎందుకు ప్రవేశించింది? అనే ఆసక్తికరమైన ప్రశ్నల చుట్టూ కథ తిరుగుతుందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.
ట్రైలర్ చివర్లో వరుణ్ తేజ్ చెప్పిన 'అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా.. వాడు నరకానికి పోకుండానే నరకమెట్లుంటదో చూపిస్తా' అనే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వివరాలు
వరుణ్ తేజ్ ఏమన్నారంటే..
ట్రైలర్ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఒక మంచి వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. ఆగస్టు 7న మా ప్రయత్నం ఫలించి, అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా. ఇందులో నేను రెండు కోణాల్లో కనిపిస్తాను.
ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉంటే ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయన్నది కథలో ఆసక్తికరంగా ఉంటుంది. నటుడిగా నాకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇదేనని చెప్పారు.
వివరాలు
అద్భుతమైన వినోదం ఉంది
దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో అద్భుతమైన వినోదం ఉంది.
ముఖ్యంగా వరుణ్ తేజ్, సత్యల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ రితికా నాయక్, నటుడు సత్య, మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.