లియో సినిమాపై ఉదయనిధి స్టాలిన్ రివ్యూ: ఫిలిమ్ మేకింగ్ అదుర్స్ అంటూ ట్వీట్
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లియో. దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా లియో చిత్రం విడుదల అవుతుంది. అయితే లియో సినిమాకు విడుదలకు ముందే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ ఎగ్జిబిటర్లు, సినిమా ప్రముఖుల కోసం లియో సినిమా స్పెషల్ ప్రివ్యూలను మంగళవారం వేశారు. ఈ ప్రివ్యూస్ లో లియో సినిమాను వీక్షించిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తన రివ్యూను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. లియో సినిమా అదిరిపోయిందని, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఫిలిమ్ మేకింగ్ అద్భుతంగా ఉందని, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, అన్బు ఆరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయని ఉదయనిధి స్టాలిన్ ట్వీట్ చేశారు.
వైరల్ గా మారిన ఉదయనిధి స్టాలిన్ ట్వీట్
ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ చేసిన ట్వీట్ ఇంటర్నెట్లో వైరల్ గా మారుతుంది. సినిమా విడుదలకు ముందే పాజిటివ్ రివ్యూస్ రావడంతో విజయ్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. విజయ్ నటించిన లియో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. లియో ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తమిళంలోనే కాదు ఇటు తెలుగులో కూడా లియో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే, అమెరికాలో లియో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లు వన్ మిలియన్ డాలర్ ను చేరుకున్నాయి. త్రిష హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించింది.