LOADING...
GST Changes: జీఎస్టీలో మార్పులు.. సింగిల్‌ స్క్రీన్‌లకు ఊరట.. 
జీఎస్టీలో మార్పులు.. సింగిల్‌ స్క్రీన్‌లకు ఊరట..

GST Changes: జీఎస్టీలో మార్పులు.. సింగిల్‌ స్క్రీన్‌లకు ఊరట.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

మల్టీప్లెక్స్‌ థియేటర్ల విభాగం పెరిగిన నేపథ్యంలో ఇంతవరకు ఆదరణ కోల్పోయిన సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు కేంద్రం ఊరట కల్పించే వార్తనిచ్చింది. రూ.100 వరకు ఉన్న సినిమా టికెట్లపై జీఎస్‌టీ రేటును తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ టికెట్లపై ఇప్పటివరకు 12 శాతం జీఎస్‌టీ ఉండగా, తాజాగా దీన్ని 5 శాతం వరకు తగ్గించారు. ఈ నిర్ణయం ప్రధానంగా చిన్న పట్టణాల సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు, స్థానిక సినిమా హాళ్లకు ప్రత్యక్ష లాభం చేకూర్చే విధంగా తీసుకోవడం జరిగింది. అయితే, రూ.100 కంటే ఎక్కువ ధర ఉన్న టికెట్లపై 18 శాతం జీఎస్‌టీ వసూలు కొనసాగుతుంది. అంటే, మల్టీప్లెక్స్‌, ప్రీమియం థియేటర్లకు ఈ కొత్త జీఎస్‌టీ రేటు ప్రభావం ఉండదు.

వివరాలు 

క్యారమెల్‌ పాప్‌కార్న్‌కు 18 శాతం పన్ను

పాప్‌కార్న్‌ లేకుండా సినిమా పూర్తి కాదు.. గతంలో చర్చకు దారి తీసి మీమ్స్‌లో హైలైట్ అయిన పాప్‌కార్న్‌పై నూతన జీఎస్టీ విధానంలో స్పష్టత వచ్చేసింది. సాల్ట్‌ పాప్‌కార్న్‌ను 5 శాతం జీఎస్‌టీ రేటులోకి తీసుకువచ్చారు, కాబట్టి ఇది ప్యాక్‌ చేసినా, విడిగా అమ్మినా ఏ భేదం లేదు. క్యారమెల్‌ పాప్‌కార్న్‌కు 18 శాతం పన్ను వర్తించనుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీలో కీలక మార్పులు చేసింది. గతంలో ఉన్న నాలుగు జీఎస్‌టీ శ్లాబ్‌లను రద్దు చేసి, ఇకపై రెండు శ్లాబ్‌లు మాత్రమే కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5%,మరొకటి 18% గా నిర్ణయించారు.