Loading...
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో ప్రయాణికుడి రచ్చ!
విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో ప్రయాణికుడి రచ్చ!

Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో ప్రయాణికుడి రచ్చ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2026
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

సెలబ్రిటీలను చూసినప్పుడు కొందరు అభిమానులు చూపించే అత్యుత్సాహం ఒక్కోసారి హద్దులు దాటుతోంది. ఫొటోలు, సెల్ఫీల కోసం వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్‌ కీర్తి సురేష్ కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సెల్ఫీ కావాలంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎంత మర్యాదగా చెప్పినా వినకుండా గొడవకు దిగాడు. చివరకు విమాన సిబ్బంది జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటన గురించి కీర్తి స్వయంగా వెల్లడించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

వివరాలు

మద్యం మత్తులో వచ్చి.. సెల్ఫీ కోసం వేధింపులు

కీర్తి సురేశ్‌ తన భర్త ఆంటోని థట్టిల్‌తో కలిసి మిలాన్‌ నుంచి భారత్‌కు విమానంలో తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విమానం గాల్లో ఉండగా.. సరిగ్గా నిలబడలేని పరిస్థితిలో ఉన్న ఓ ప్రయాణికుడు కీర్తి సీటు దగ్గరకు వచ్చాడు. ఆమెతో సెల్ఫీ తీసుకోవాలని కోరాడు.

అయితే అతడి పరిస్థితిని గమనించిన కీర్తి.. కాసేపు ఆగిన తర్వాత ఫొటో దిగుదామని ఎంతో మర్యాదగా సమాధానమిచ్చారు.

కానీ సదరు ప్రయాణికుడు ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. మద్యం మత్తులో ఉన్న అతడు వెంటనే సెల్ఫీ దిగాలంటూ కీర్తిపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాడు.

ఎంత చెప్పినా వినకుండా తన మొండివైఖరిని ప్రదర్శించాడు. దీంతో కీర్తి తీవ్ర అసహనానికి గురయ్యారు.

వివరాలు

నా ఇష్టం వచ్చినప్పుడే ఫొటో దిగుతా..

ప్రయాణికుడి ప్రవర్తనతో విసిగిపోయిన కీర్తి సురేశ్‌ అతడికి స్పష్టంగా సమాధానమిచ్చారు. ''నేను ఎప్పుడు ఫొటో తీసుకోవాలో మీరు నిర్ణయించలేరంటూ ముఖం మీదే తేల్చిచెప్పారు.

పక్కనే ఉన్న ఆమె భర్త ఆంటోని థట్టిల్‌ కూడా సదరు వ్యక్తిని వారించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అతడు వెనక్కి తగ్గలేదు.

దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. చేసేదేమీ లేక కీర్తి దంపతులు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన సిబ్బంది అక్కడికి చేరుకుని సదరు ప్రయాణికుడిని కీర్తి సీటు దగ్గరి నుంచి మరోచోటుకు తరలించారు. దీంతో విమానంలో నెలకొన్న గొడవ సద్దుమణిగింది.

ADVERTISEMENT

వివరాలు

అభిమానులపై కీర్తి ఏమన్నారంటే?

ఈ ఘటనపై స్పందించిన కీర్తి సురేశ్‌.. అభిమానులతో మాట్లాడటం, వారితో ఫొటోలు దిగడం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.

అయితే కొందరు కనీస వ్యక్తిగత పరిమితులను కూడా గౌరవించకుండా ప్రవర్తించడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే సమయంలో ఎంతోమంది అభిమానులు చాలా హుందాగా, ఆప్యాయంగా పలకరిస్తారని కీర్తి పేర్కొన్నారు. అలాంటి అభిమానుల ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు.

సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను, వారి ఇష్టాయిష్టాలను గౌరవించాలని ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది.

ADVERTISEMENT