Upasana Konidela: పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌తో ఎంతో బాధపడ్డా.. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన
ఈ వార్తాకథనం ఏంటి
మెగా కోడలు, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ కొణిదెల ఉపాసన ఎప్పుడూ నవ్వుతూ, ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంటారు. అయితే ఆ చిరునవ్వు వెనుక తీవ్రమైన మానసిక వేదన దాగి ఉందని ఆమె తాజాగా వెల్లడించారు. ఓ బహిరంగ కార్యక్రమంలో తన రెండో గర్భధారణ, ప్రసవం తర్వాత ఎదుర్కొన్న పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అపోలో ఆసుపత్రిలో 'అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్' ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఉపాసన తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.
వివరాలు
'నా మనసు ఇంకా ఆ గాయాల నుంచి కోలుకుంటోంది'
తన రెండో గర్భధారణలో కవలలకు జన్మనిచ్చిన ప్రయాణం ఎంతో కఠినంగా సాగిందని ఉపాసన తెలిపారు. ఆ అనుభవం గురించి పూర్తిగా మాట్లాడేంతగా తన మనసు ఇంకా కుదుటపడలేదని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
"పైకి ఎంతో ఆనందంగా, నవ్వుతూ కనిపిస్తున్న ఈ ముఖం వెనుక.. ఇంకా తన గాయాలను మాన్పుకుంటున్న ఓ తల్లి ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ "నా కాళ్లు వణుకుతున్నాయి.. నేనిక్కడే కూర్చుంటాను" అంటూ వేదికపైనే కుర్చీలో కూర్చుండిపోయారు.
మొదటి డెలివరీ సమయంలో ఎదురుకాని పోస్ట్‌పార్టమ్ సమస్యలు.. రెండో డెలివరీ తర్వాత తనను ఊహించని విధంగా మానసికంగా కుంగదీశాయని చెప్పారు. ఆ బాధ నుంచి ఇంకా కోలుకుంటున్నానని వెల్లడించారు.
వివరాలు
లాస్ ఏంజిల్స్ ప్రయాణం.. డాక్టర్ సుమ ఆందోళన
తన రెండు గర్భధారణల సమయంలోనూ అడుగడుగునా అండగా నిలిచిన వైద్యులు డాక్టర్ సుమ, డాక్టర్ నమితలకు ఉపాసన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
తొలిసారి గర్భంతో ఉన్నప్పుడు మూడో త్రైమాసికంలో భర్త రామ్ చరణ్ అవార్డుల కార్యక్రమం కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
ఆ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని డాక్టర్ సుమ అడుగడుగునా దేవుడిని ప్రార్థించారని చెప్పారు.
తాను తిరిగి భారత్‌లో అడుగుపెట్టే వరకు డాక్టర్ ఆందోళనతో ఉన్నారని, ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.
వివరాలు
గర్భధారణ అంటే తొమ్మిది నెలలు మాత్రమే కాదు..
గర్భధారణ అనేది కేవలం తొమ్మిది నెలలు, మూడు దశల (ట్రైమిస్టర్స్) ప్రయాణం మాత్రమే కాదని ఉపాసన అభిప్రాయపడ్డారు.
గర్భం దాల్చడానికి ప్రయత్నించే ముందు ఎదురయ్యే మానసిక ఆందోళనను కూడా సమాజం గుర్తించాలని అన్నారు.
"గర్భం కోసం ప్రయత్నించే సమయంలో పీరియడ్స్ మిస్ అయితే అది ఓ పెద్ద పండగ. అదే పీరియడ్స్ వస్తే మాత్రం ఆ క్షణంలో గుండె ఆగిపోయినంత పనవుతుంది.
సహజంగా ప్రయత్నించినా, ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్ తీసుకున్నా ఈ ఆందోళన ఎవరికైనా ఒకటే. కానీ దీని గురించి ఎవరూ బయటకు మాట్లాడరు" అని ఉపాసన పేర్కొన్నారు.
వివరాలు
నాలుగో ట్రైమిస్టర్‌లో తల్లికి కుటుంబం అండగా ఉండాలి
ప్రసవం తర్వాత ఉండే 'నాలుగో ట్రైమిస్టర్' కూడా ఎంతో కీలకమని ఉపాసన చెప్పారు. ఆ సమయంలో తల్లికి కుటుంబ సభ్యులు, వైద్యుల సహకారం ఎంతో అవసరమని వివరించారు.
దయచేసి ఇలాంటి కష్టకాలంలో దంపతులు తమలో తాము కుమిలిపోకుండా, ఓ గదికే పరిమితం కాకుండా బయటకు వచ్చి వైద్యుల సహాయం తీసుకోండి.
నా డాక్టర్లు, నా టీమ్ నాకు ఎంతో అండగా నిలిచారు. డెలివరీ తర్వాత నాలుగో ట్రైమిస్టర్‌లో తల్లికి అందరి అండ చాలా అవసరం.
ఆ సమయంలో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోండి"అని ఉపాసన సూచించారు.
తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ.. ప్రసవం తర్వాత తల్లులు ఎదుర్కొనే మానసిక సమస్యలను గుర్తించాలని, వారికి కుటుంబ సభ్యులు అండగా నిలవాలని ఉపాసన సమాజానికి సందేశమిచ్చారు.