Page Loader
Hero Sriram : కోలీవుడ్‌లో కలకలం.. డ్రగ్స్ కేసులో హీరో అరెస్ట్ 
కోలీవుడ్‌లో కలకలం.. డ్రగ్స్ కేసులో హీరో అరెస్ట్

Hero Sriram : కోలీవుడ్‌లో కలకలం.. డ్రగ్స్ కేసులో హీరో అరెస్ట్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ చిన్నతనంలోనే నటనపై ఆసక్తితో చెన్నై వెళ్లారు. తొలుత తన పేరు శ్రీకాంత్ నుంచి శ్రీరామ్‌గా మార్చుకుని చిన్న చిన్న పాత్రల్లో నటించడం మొదలుపెట్టిన ఆయన 'రోజా పూలు' సినిమాతో తెలుగు, తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 'ఒకరికి ఒకరు' సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీరామ్ ఇటీవల 'హరికథ' అనే వెబ్ సిరీస్‌లో కూడా ఆకట్టుకున్నారు.

Details

డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ 

తాజాగా శ్రీరామ్‌ను చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు సేకరించారు. అనంతరం నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌ కు తరలించి సుమారు రెండు గంటల పాటు విచారించారు.

Details

ఎయ్‌ఐఎడీఎంకే నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్టు ఆరోపణలు 

మాజీ ఎయ్‌ఐఎడీఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు రావడంతో శ్రీరామ్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్న సమయంలో శ్రీరామ్ పేరు బయటకువచ్చింది. ఈ సమాచారంతో శ్రీరామ్‌ను అరెస్ట్ చేసి నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు విచారిస్తున్నారు. కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన 'స్నేహితులు' సినిమాలో జీవాతో కలిసి శ్రీరామ్ నటించారు. ఇప్పుడు శ్రీరామ్ అరెస్ట్ కావడం చెన్నై సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.