Rajinikanth: తమిళనాడులో కలకలం.. రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్న ఈ బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రముఖ నటుడు ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. వీరితో పాటు టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుతంగై నివాసాన్నీ పేల్చివేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా హెచ్చరించారు. చెన్నైలోని డీజీపీ కార్యాలయానికి ఒక అనుమానాస్పద ఈమెయిల్ అందింది. అందులో పొయెస్ గార్డెన్‌లో ఉన్న రజనీకాంత్, ధనుష్ ఇళ్లతో పాటు కీల్పాక్క్‌లోని కాంగ్రెస్ నేత సెల్వపెరుతంగై ఇంటిని పేల్చివేయాలనే బెదిరింపు ఉన్నట్లు తెలుస్తోంది. ఈమెయిల్ అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను పంపించారు.
Details
దర్యాప్తు చేపడుతున్న పోలీసులు
సంబంధిత ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఇది తమిళనాడులో మొదటిసారి జరుగుతున్న విషయం కాదు. ఈ నెల 3న సీఎం స్టాలిన్, నటి త్రిష ఇళ్లకు, బీజేపీ కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకూ ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన విషయం తెలిసిందే. అంతకుముందు అక్టోబర్ 13న కూడా సీఎం స్టాలిన్, రజనీకాంత్ ఇళ్లకు బెదిరింపు ఈమెయిల్స్ రావడం కలకలం రేపింది. ఇటీవలి ఈ సంఘటనలతో చెన్నైలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈమెయిల్ వెనుక ఉన్న వ్యక్తి లేదా ముఠాను గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వరుస బెదిరింపుల వెనుక ఒకే గుంపు ఉందా? లేక వేర్వేరు వ్యక్తులు ఉన్నారా? అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది.