Page Loader
Game Changer: గేమ్ ఛేంజర్ వ్యాఖ్యలపై దుమారం.. బహిరంగంగా క్షమాపణలు చెప్పిన నిర్మాత!
గేమ్ ఛేంజర్ వ్యాఖ్యలపై దుమారం.. బహిరంగంగా క్షమాపణలు చెప్పిన నిర్మాత!

Game Changer: గేమ్ ఛేంజర్ వ్యాఖ్యలపై దుమారం.. బహిరంగంగా క్షమాపణలు చెప్పిన నిర్మాత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 02, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

నితిన్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తమ్ముడు' విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో ముమ్మరంగా పాల్గొంటోంది. హీరో, హీరోయిన్‌తో పాటు నిర్మాతలైన దిల్ రాజు, శిరీష్ కూడా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా విశేషాలు పంచుకుంటున్నారు. అయితే, ఇదే సందర్భంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం 'గేమ్ ఛేంజర్' గురించి నిర్మాత శిరీష్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపాయి.

Details

సోషల్ మీడియాలో అభిమానులు ఫైర్

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ విడుదల తర్వాత రామ్ చరణ్ గానీ, డైరెక్టర్ శంకర్ గానీ నన్ను సంప్రదించలేదు. నష్ట నివారణ చర్యల గురించి ఎలాంటి చర్చ జరగలేదని చెప్పిన శిరీష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించాయి. ఈ మాటలు మెగా అభిమానుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీశాయి. రామ్ చరణ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సరికాదంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. చరణ్ తన వంతు సహకారం అందించాడని తెలిసినా, ఇలా మాట్లాడటం తగదంటూ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

Details

క్షమాపణలతో సద్ధుమణిగిన పరిస్థితి

ఈ నేపథ్యంలో శిరీష్ తక్షణమే స్పందించి ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. అందులో ఆయన స్పష్టంగా పేర్కొంటూ, "నా వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా నొచ్చినట్లయితే, అది నా ఉద్దేశం కాదు. గేమ్ ఛేంజర్ షూటింగ్ సమయంలో చరణ్ అన్నివిధాలా సహకరించారు. ఆయన తన సమయాన్ని పూర్తిగా కేటాయించి సినిమాపై నమ్మకంతో పని చేశారు. ఆయనతో పాటు చిరంజీవి కుటుంబంతో మా బంధం చాలా కాలంగా ఉంది. నేను చెప్పిన మాటలు కొన్ని సందర్భాల్లో తప్పుగా అర్థమయ్యాయి. నేను ఎప్పటికీ వారి ప్రతిష్ఠను కించపరచాలనుకోనని పేర్కొన్నారు. శిరీష్ చేసిన ఈ బహిరంగ క్షమాపణలతో పరిస్థితి కొంత మేరకు సద్దుమణిగింది.