Varsham: ప్రభాస్ 'వర్షం' వెనక ఆసక్తికర కథ.. అసలు ఆ టైటిల్ ఎవరిదో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ కెరీర్‌లో తొలి భారీ విజయాన్ని అందించిన సినిమా 'వర్షం'. ఈ చిత్రమే ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. 2004లో విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రేక్షకులకు తెలిసిందే. నిర్మాత ఎం.ఎస్. రాజు నిర్మాణంలో, పరుచూరి బ్రదర్స్ కథతో, దర్శకుడు శోభన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
వివరాలు
ముందే నిర్ణయించిన 'వర్షం' టైటిల్
కథ మొత్తం వర్షం నేపథ్యంలో సాగుతుండటంతో, చిత్రానికి మొదటి నుంచే 'వర్షం' అనే పేరును పెట్టాలని నిర్ణయించారు. అయితే ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేయాలని ప్రయత్నించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అప్పటికే 'మనసంతా నువ్వే' వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఆ టైటిల్‌ను ముందుగానే రిజిస్టర్ చేసి పెట్టారు. నాగార్జున హీరోగా తెరకెక్కించాలనుకున్న ఒక సినిమా కోసం వి.ఎన్. ఆదిత్య 'వర్షం' టైటిల్‌ను రిజిస్టర్ చేశారు. కానీ నిర్మాత ఎం.ఎస్. రాజు ఆ టైటిల్ కావాలని అడగడంతో, వి.ఎన్. ఆదిత్య పెద్దమనసుతో అంగీకరించి ఆ పేరును వారికి ఇచ్చేశారు.
వివరాలు
టైటిల్ మారిన నాగార్జున సినిమా
దాంతో ప్రభాస్ నటించిన చిత్రానికి 'వర్షం' అనే టైటిల్ ఖరారైంది. ఇక నాగార్జున కోసం సిద్ధం చేసిన కథలో కొన్ని మార్పులు చేసి, ఆ సినిమాకు 'నేనున్నాను' అనే పేరును పెట్టారు. 2004 సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'వర్షం' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అదే సంవత్సరం ఏప్రిల్‌లో విడుదలైన 'నేనున్నాను' మాత్రం సగటు విజయంతో (యావరేజ్) సరిపెట్టుకుంది.