హాలీవుడ్ స్టైల్ యాక్షన్ తో అదరగొడుతున్న గాండీవధారి అర్జున ప్రీ టీజర్
వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గాండీవధారి అర్జున చిత్రం, ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు. తాజాగా గాండీవధారి అర్జున ప్రీ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీన్లు కనిపిస్తున్నాయి. కార్ ఛేజ్, బైక్ ఛేజ్, గన్ షాట్లను చూపించిన దర్శకుడు, వరుణ్ తేజ్ ముఖాన్ని మాత్రం చూపించలేదు. చూస్తుంటే పవర్ ఫుల్ యాక్షన్ సినిమాగా గాండీవధారి అర్జున తెరకెక్కిందని అర్థమవుతోంది. మరికొద్ది రోజుల్లో టీజర్ ని రిలీజ్ చేస్తామని, అంచనాలను మించి ఉండేలా టీజర్ ను రెడీ చేస్తున్నామని వరుణ్ తేజ్ తెలియజేసాడు.
ఘోస్ట్ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున
గాండీవధారి అర్జున సినిమాను ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో ఎల్బీడబ్ల్యూ, చందమామ కథలు, గుంటూరు టాకీస్, పీఎస్ గరుడవేగ సినిమాలను తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు, ఈ మధ్య నాగార్జునతో ఘోస్ట్ తెరకెక్కించి ఫ్లాపును మూటగట్టుకున్నాడు. ఘోస్ట్ తర్వాత ప్రవీణ్ సత్తారు చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాలో హీరోయిన్ గా ఏజెంట్ భామ సాక్షి వైద్య కనిపిస్తోంది. నాజర్, విమలా రామన్, నరైన్, వినయ్ రాయ్, రొషిణి ప్రకాష్, అభినవ్ గొమఠం ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి ఈసారి వరుణ్ తేజ్ మంచి హిట్ సాధిస్తాడేమో చూడాలి.