Loading...
Pradeep Rawat: 'సై' భిక్షూయాదవ్‌ ప్రదీప్‌ రావత్‌ మృతి.. సినీ లోకంలో విషాదం
'సై' భిక్షూయాదవ్‌ ప్రదీప్‌ రావత్‌ మృతి.. సినీ లోకంలో విషాదం

Pradeep Rawat: 'సై' భిక్షూయాదవ్‌ ప్రదీప్‌ రావత్‌ మృతి.. సినీ లోకంలో విషాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2026
07:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతినాయకుడిగా భయపెట్టి... హాస్య ప్రధానమైన పాత్రలతో నవ్వించి.. సహాయ పాత్రలతోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ (74) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన మంగళవారం ముంబయిలో తుదిశ్వాస విడిచారు. దిల్లీలో పుట్టి పెరిగిన ప్రదీప్‌ రావత్‌ వృత్తిరీత్యా ముంబయిలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య కల్యాణి, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. కల్యాణి తెలుగు కుటుంబానికి చెందినవారు. హిందీ చిత్రాలతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయనకు తెలుగు సినీ పరిశ్రమతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.

వివరాలు 

'సై' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రదీప్‌ రావత్

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన 'సై' చిత్రంలో భిక్షూయాదవ్‌ అనే క్రూరమైన ప్రతినాయకుడి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రదీప్‌ రావత్‌, తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.

ఆ సినిమా విజయంతో వరుసగా తెలుగు చిత్రాల్లో అవకాశాలు అందుకున్నారు.

నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, మరాఠీ, భోజ్‌పురి, ఆంగ్లం తదితర భాషల్లో నటించి విశేష గుర్తింపు సంపాదించారు.

అయితే, తాను ఈ స్థాయికి రావడంలో తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆదరణే ప్రధాన కారణమని ఆయన పలుమార్లు పేర్కొన్నారు.

వివరాలు 

బ్యాంకు ఉద్యోగం నుంచి నటుడిగా...

ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్‌ పూర్తి చేసిన ప్రదీప్‌ రావత్‌ తొలుత ఓ బ్యాంకులో ఉద్యోగం చేశారు.

ఆయన శరీరాకృతి, కళ్లలోని హావభావాలను గమనించిన సహోద్యోగులు నటన వైపు ప్రోత్సహించడంతో నాటకాలలో నటించడం ప్రారంభించారు.

ముంబయికి బదిలీ అయిన తర్వాత కూడా రంగస్థల ప్రదర్శనలను కొనసాగించారు.

ఆ సమయంలో ప్రముఖ బాలీవుడ్‌ నటి స్మితా పాటిల్‌ దృష్టిలో పడిన ఆయనను, దర్శకుడు రవి చోప్రాకు పరిచయం చేశారు.

దీంతో మహాభారత్‌ టెలివిజన్‌ ధారావాహికలో అశ్వత్థామ పాత్రను పోషించే అవకాశం దక్కింది.

అనంతరం మరికొన్ని టీవీ సీరియళ్లు, సినిమాల్లో నటించినప్పటికీ, అమితాబ్‌ బచ్చన్‌ నటించిన 'అగ్నిపథ్‌' చిత్రం ఆయన కెరీర్‌కు కీలక మలుపు తీసుకొచ్చింది.

ADVERTISEMENT

వివరాలు 

'సై'తో తెలుగు ప్రేక్షకులకు చేరువ

అందులో అమితాబ్‌కు అంగరక్షకుడి పాత్రలో కనిపించిన ప్రదీప్‌ రావత్‌కు తర్వాత బాలీవుడ్‌ అగ్ర కథానాయకుల చిత్రాల్లో వరుస అవకాశాలు లభించాయి.

'లగాన్‌' చిత్రంలో పోషించిన సహాయ పాత్ర ఆయనకు మరింత గుర్తింపు తీసుకొచ్చి, ఇతర భాషల దర్శకుల దృష్టినీ ఆకర్షించింది.

'లగాన్‌' తర్వాత హిందీలో బిజీగా ఉన్న సమయంలోనే రాజమౌళి ఆయనను 'సై' చిత్రానికి ఎంపిక చేశారు.

భిక్షూయాదవ్‌ పాత్రలో ఆయన చూపిన విలనిజం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

ఆ పాత్రకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం కూడా అందుకున్నారు.

ఆ తర్వాత దక్షిణాది చిత్రాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ నటుడిగా మారిపోయారు.

ADVERTISEMENT

వివరాలు 

విలన్‌గా ప్రారంభమై..

తెలుగులో 'భద్ర'లో వీరయ్యగా,'దేశముదురు'లో తంబి దురైగా,'ఛత్రపతి'లో రాజ్‌ బిహారీగా, 'లక్ష్మి'లో రాయుడుగా తనదైన నటనతో మెప్పించారు.

అలాగే 'స్టాలిన్‌', 'దేశముదురు', 'యోగి', 'జగడం', 'మస్కా', 'ఓయ్‌!', 'రెబల్‌', 'నాయక్‌', 'బాద్‌షా', '1 నేనొక్కడినే', 'సరైనోడు' వంటి చిత్రాల్లో పోషించిన పాత్రలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.

ప్రతినాయక పాత్రలతో ఎక్కువగా గుర్తింపు పొందినప్పటికీ, 'పూలరంగడు' చిత్రంలో విలన్‌ పాత్రలోనే హాస్యాన్ని పండించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

'నేను శైలజ' చిత్రంలో కథానాయకుడి స్నేహితుడి పాత్రలో కనిపించి మరో కోణాన్ని చూపించారు.

ఇటీవల విడుదలైన 'గాయపడ్డ సింహం' ఆయన చివరిసారిగా కనిపించిన తెలుగు చిత్రం.

వివరాలు 

విలన్‌గా ప్రారంభమై..

అలాగే 'గజిని' చిత్రంలో ద్విపాత్రాభినయంతో ప్రతినాయకుడిగా నటించి ప్రశంసలు అందుకున్నారు.

అదే పాత్రను హిందీ వెర్షన్‌లోనూ పోషించి తన నటనతో ఆకట్టుకున్నారు.

తెరపై ఎక్కువగా క్రూరమైన విలన్‌గా కనిపించిన ప్రదీప్‌ రావత్‌, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తిగా సినీ వర్గాల్లో పేరు తెచ్చుకున్నారు.

ఆయన ఆకస్మిక మరణంతో తెలుగు సహా భారతీయ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ADVERTISEMENT