
ఎన్నెన్నో జన్మల బంధం ఈనాడే కన్నుమూసింది, సింగర్ వాణీజయరాం హఠాన్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ సినిమా పాటలకు తన గొంతునిచ్చిన ప్రఖ్యాత గాయని, భారత ప్రభుత్వంచే ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకున్న దిగ్గజం వాణీ జయరాం ఈరోజు కన్నుమూసారు.
చెన్నైలోని నంగుంబాక్కం ఏరియాలోని హడ్డోస్ రోడ్ లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఆమె నుదురుకు జరిగిన ప్రమాదం వల్లే ప్రాణాలు విడిచారని తెలుస్తోంది.
ఎన్నో సినిమాలకు పాటలు పాడిన ఆమె గొంతు 78ఏళ్ల వయసులో మూగబోయింది. తెలుగు తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, భోజ్ పురి, తులు ఇంకా ఒరియా భాషల్లో ఆమె పాటలు పాడింది.
ఆమె పాడిన పాటలకు ఇప్పటివరకు మూడుసార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.
వాణీ జయరాం
50సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న వాణీ జయరాం
1945 నవంబర్ 30వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో వేలూరులో జన్మించారు వాణీ జయరాం. 1951లో నేపథ్య గాయనిగా కెరీర్ మొదలు పెట్టి సుమారు 10వేల పాటలు పాడి గాయనిగా 50సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్నారు.
ఇళయరాజా, ఆర్డీ బర్మన్, కేవీ మహదేవన్, ఓపీ నయ్యర్, మదన్ మోహన్ వంటి గొప్ప సంగీత దర్శకుల సినిమాల్లో పాటలు పాడారు.
ఎన్నో భాషల్లో పాటలు పాడిన వాణీ జయరాం, 1973లో వచ్చిన అభిమానవంతులు సినిమాలో ఎప్పటివలె కాదురా నా స్వామి అనే పాటతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు.
1975లో వచ్చిన పూజ సినిమాలోని ఎన్నెన్నో జన్మల బంధం పాట ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. పూజ సినిమాతో తెలుగులో ఆమెకు తిరుగులేకుండా పోయింది.