padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్‌కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు
ఎస్పీ వ్యవస్థాపకులు, దివంగత ములాయం సింగ్ యాదవ్, సంగీతకారుడు జాకీర్ హుస్సేన్, ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) సృష్టికర్త ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు దివంగత దిలీప్ మహలనాబిస్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు దేశ రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్‌ను కేంద్రం ప్రకటించింది. 2023 గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ ఏడాది 6 పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 91 పద్మశ్రీ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర వేశారు. మొత్తం 106 అవార్డుల్లో 19 మంది గ్రహితలు మహిళలు కావడం గమనార్హం. ఇందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. ములాయం, దిలీప్ మహలనాబిస్ సహా ఏడుగురు మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.
2023 ఏడాదికి గాను మొత్తం 106మందికి పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం
చిన జీయర్ స్వామికి పద్మ భూషణ్, ఎంఎం కీరవాణికి పద్మశ్రీ
పద్మ అవార్డుల గ్రహితల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. తెలంగాణ నుంచి ప్రముఖ ఆద్యాత్మిక వేత్త చిన జీయర్ స్వామి, కమలేష్ డి పటేల్ ఇద్దరూ పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో విశేష కృషి చేసిన మోదడుగు విజయ్ గుప్తా, పసుపులేటి హన్మంతరావు( వైద్యం), సాహిత్యం రంగానికి చెందిన బి. రామకృష్ణా రెడ్డిని పద్మశ్రీ అవార్డు వరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో గణేశ్ నాగప్ప, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, ఆర్ట్ విభాగంలో సీవీ రాజు, సచ్చిదానంద శాస్త్రి, సామాజికసేవ విభాగంలో సంకురాత్రి చంద్రశేఖర్, సాహిత్యం, విద్య విభాగంలో ప్రకాశ్ చంద్ర సూద్‌లు పద్మశ్రీకి ఎంపికయ్యారు.