LOADING...
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ స్వగ్రామంలో సందడి.. నాగర్‌కర్నూల్‌లో ఘన స్వాగతం!
విజయ్ దేవరకొండ స్వగ్రామంలో సందడి.. నాగర్‌కర్నూల్‌లో ఘన స్వాగతం!

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ స్వగ్రామంలో సందడి.. నాగర్‌కర్నూల్‌లో ఘన స్వాగతం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2026
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మంధన్న దంపతులు తమ స్వగ్రామానికి చేరుకున్నారు. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లా, బలమూరు మండలం తుమ్మన్‌పేటలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామస్థులు నూతన దంపతులకు ఘనస్వాగతం పలుకుతూ డప్పు చప్పుళ్ల మధ్య వారి ఇంటివరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.

Details

తులసిమాతకు ప్రత్యేక పూజలు

ఇవాళ ఉదయం 11:15గంటలకు విజయ్-రష్మిక వేదమంత్రాల నడుమ, డప్పు వాయిద్యాల మధ్య తులసిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొన్నారు. కొత్త దంపతులను చూసేందుకు గ్రామస్థులతో పాటు పరిసర గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. అభిమానుల రద్దీతో విజయ్ ఇంటి వద్ద సందడి మరింత పెరిగింది. అభిమానుల రాక ఎక్కువగా ఉండటంతో స్థానిక పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఆంక్షలు విధిస్తూ పాసులు ఉన్నవారికే వ్రతం జరుగుతున్న మండపంలోకి ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా అనుమతి ఇస్తున్నారు. ఈ భద్రతా ఏర్పాట్లను అచ్చంపేట డీఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. వ్రతం అనంతరం సుమారు 2,000 మందికి భోజన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

Details

ఉదయ్‌పూర్‌లో పెళ్లి.. హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

విజయ్-రష్మిక వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్‌లో ఘనంగా జరిగింది. ఇక మార్చి 4 సాయంత్రం హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌లో వెడ్డింగ్ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. 'విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్'గా పిలుస్తున్న ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ ఈవెంట్‌ను 'ఇన్వైట్ ఓన్లీ' కార్యక్రమంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. రిసెప్షన్ జరిగే హోటల్ బయట గుమిగూడవద్దని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని అభిమానులను విజయ్-రష్మిక కోరారు. కేవలం ఆహ్వానం ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని తెలిపారు. అలాగే ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరు కావాలని నరేంద్ర మోదీని విజయ్, రష్మిక స్వయంగా వెళ్లి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Advertisement