LOADING...
Vijay: విజయ్ అభిమానులకు శుభవార్త.. విడుదలకు సిద్ధమైన 'జన నాయగన్'!
విజయ్ అభిమానులకు శుభవార్త.. విడుదలకు సిద్ధమైన 'జన నాయగన్'!

Vijay: విజయ్ అభిమానులకు శుభవార్త.. విడుదలకు సిద్ధమైన 'జన నాయగన్'!

వ్రాసిన వారు Moogati Shabari
Jul 09, 2026
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ నటుడు, తమిళనాడు రాజకీయ నాయకుడు విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జన నాయగన్' సినిమా విడుదలపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి త్వరలోనే ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు ఏడు నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో జులై 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కెనడాకు చెందిన ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది.

వివరాలు

కెనడా డిస్ట్రిబ్యూటర్ పోస్టుతో పెరిగిన ఆసక్తి..

కెనడాలో చిత్రాల పంపిణీ చేసే యార్క్ సినిమాస్ సంస్థ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికరమైన పోస్టు చేసింది. "ఎట్టకేలకు సమయం ఆసన్నమైంది. దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కెనడాలో ఈ చిత్రాన్ని యార్క్ సినిమాస్ విడుదల చేయనుంది. జులై 24 నుంచి థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. టికెట్ల వివరాల కోసం వేచి ఉండండి" అని పేర్కొంది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ పోస్టు కారణంగా సినిమా విడుదలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వివరాలు

ముగింపు దశలో సెన్సార్ ప్రక్రియ..

ఇదిలా ఉంటే, 'జన నాయగన్' చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమం తుది దశకు చేరుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచించిన మార్పులన్నింటినీ చిత్రబృందం పూర్తి చేసినట్లు సమాచారం. శుక్రవారం నాటికి సెన్సార్ సర్టిఫికెట్ కూడా అందే అవకాశముందని తెలుస్తోంది. సర్టిఫికెట్ అందిన వెంటనే నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది. విదేశీడిస్ట్రిబ్యూటర్లకు జులై 24 విడుదలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సమాచారం ఇచ్చినట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ చివరి నిమిషంలో మార్పులు చోటుచేసుకుంటే, జులై 24కు బదులుగా ఒక రోజు ముందే అంటే జులై 23న సినిమాను విడుదల చేసే అవకాశాన్ని కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Advertisement