తంగలాన్ సినిమా షూటింగ్ లో గాయపడ్డ విక్రమ్, నిలిచిపోయిన షూటింగ్
తమిళ హీరో విక్రమ్ కు షూటింగ్ లో గాయాలయ్యాయి. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతున్న తంగలాన్ సినిమా షూటింగ్ లో విక్రమ్ కు ప్రమాదం జరిగింది. దాంతో వెంటనే చిత్రీకరణకు ముగింపు చెప్పి ఆసుపత్రికి వెళ్ళారు. విక్రమ్ ని పరీక్ష చేసిన వైద్యులు పక్కటెముక విరిగిందని తెలిపినట్లు సమాచారం. ఈ గాయం నుండి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని, అప్పటివరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. తంగలాన్ సినిమాను దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. 2024మొదట్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ జరుగుతోంది.
తంగలాన్ కథ ఏంటంటే
కోలార్ బంగారు గనుల్లో జరిగిన విషయాల చుట్టూ తంగలాన్ సినిమా కథ నడుస్తుందని దర్శకుడు గతంలో వెల్లడి చేసాడు. 2డీ, త్రీడీ ఫార్మాట్లలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లోనూ విడుదల చేయాలని చూస్తున్నారు. స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా విక్రమ్ నటించిన పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ బయటకు వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లో కలుపుకుని ఇప్పటివరకు 200కోట్లకు పైగా వసూళ్ళు సాధించిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.