
Vincy Aloshious: తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని పేర్కొంటూ.. మలయాళ నటుడు షైన్ టామ్ చాకోపై నటి కంప్లైంట్..
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఇటీవల ఓ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.
ఆ సమయంలో తనకు ఎదురైన అసహ్యకరమైన సంఘటనపై ఆమె ఫిల్మ్ అసోసియేషన్‌కి ఫిర్యాదు కూడా చేశారు.
అయితే, ఆమె ఎక్కడా ఆ నటుడి పేరును బయటపెట్టలేదు. అయినప్పటికీ, ఆమె చేసిన ఫిర్యాదు నటుడు షైన్ టామ్ చాకోపై అనే విషయం బయటకు వచ్చింది.
ఈ ఘటన త్వరలో విడుదల కానున్న'సూత్రవాక్యం' అనే చిత్ర షూటింగ్ సమయంలో చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ సమయంలో షైన్ టామ్ చాకో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రచారం సాగుతోంది.
వివరాలు
పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైందని వ్యాఖ్య
ఈ వార్తలపై విన్సీ అసంతృప్తి వ్యక్తంచేస్తూ స్పందించారు.
తాను ఇప్పుడు ఒక రకంగా "పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు" అయిందని పేర్కొన్నారు.
తాను ఫిర్యాదు చేసినపుడే నటుడి పేరు గోప్యంగా ఉంచాలన్న విషయాన్ని అధికారులకు స్పష్టంగా చెప్పినప్పటికీ, అది బయటకు వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
స్థానిక మీడియాలో మాట్లాడుతూ, తాను చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.
నటుడి పేరు బయటకు రాకూడదని స్పష్టంగా కోరినా అధికారులు తన నమ్మకాన్ని దెబ్బతీశారని అన్నారు.
ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల పూర్తిగా సినిమా టీమ్‌పై ప్రతికూల ప్రభావం పడటాన్ని ఆమె తప్పుపట్టారు. అందుకే, తాను ఎక్కడా ఆ నటుడి పేరు ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.
వివరాలు
అధికారులపై నమ్మకం పెట్టుకోలేను
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమలోని అనేక సంస్థలు తనకు మద్దతుగా నిలిచాయని, దీనితో సంతోషంగా ఉందని చెప్పారు.
షైన్ టామ్ చాకోను ప్రతిభావంతుడిగా అభివర్ణిస్తూ, అతడికి సినిమాల్లో అవకాశాలు రావడంలో తప్పేమీ లేదని పేర్కొన్నారు.
తాను కోరుకుంటున్నది ఒక్కటే - అతడు చేసిన తప్పును గుర్తించి, అది సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని అన్నారు.
అయితే, ఈ పరిణామాల వల్ల తాను ఇకపై అధికారులపై నమ్మకం పెట్టుకోలేనని కూడా చెప్పారు.
వివరాలు
అసలేం జరిగిందంటే..
తనపై జరిగిన సంఘటన గురించి కొన్ని రోజుల క్రితం మీడియా ముందు మాట్లాడిన విన్సీ, షూటింగ్ సమయంలో ఆ నటుడు మత్తు పదార్థాలు (డ్రగ్స్)తీసుకున్నాడని ఆరోపించారు.
అంతేకాక, నాతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ షూటింగ్ జరిగిన రోజులన్ని తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
తన సమక్షంలోనే దుస్తులు మార్చుకోవాలని ఒత్తిడి చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని వివరించారు.
ఈ అనుభవాన్ని ఆమె ''నా జీవితంలో అసహ్యకరమైన ఘట్టం''గా అభివర్ణించారు.
ఈ నేపథ్యంలో ఇకపై డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో నటించకూడదని తుదితీర్మానం చేసుకున్నట్లు చెప్పారు.
ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో తానెక్కువ సినిమాల అవకాశాలు కోల్పోవచ్చు అనే భావన ఉన్నా,ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉందని భావించినట్లు పేర్కొన్నారు.
వివరాలు
షైన్ టామ్ చాకో తెలుగువారికి కూడా పరిచయమే
ఇప్పటికే హేమా కమిటీ నివేదిక ద్వారా మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు విన్సీ చేసిన ఆరోపణల నేపథ్యంలో మలయాళ సినిమా ఇండస్ట్రీ మళ్లీ చర్చలోకి వచ్చింది.
షైన్ టామ్ చాకో తెలుగువారికి కూడా పరిచయమే. ఇటీవల విడుదలైన 'దసరా' చిత్రంలో ఆయన ప్రతినాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే.