
Makutam: దీపావళి కానుకగా విశాల్ బిగ్ అనౌన్స్‌మెంట్.. 'మకుటం'కి తానే డైరెక్టర్
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి సందర్భంగా తన సినీ కెరీర్‌పై కొత్త అప్‌డేట్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు నటుడు విశాల్ (Vishal). 'మకుటం' (Makutam) చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మొదట దర్శకుడు రవి అరసు దర్శకత్వంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విశాల్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారని ఇటీవలే ప్రచారం జరిగింది. ఆ వార్తలపై ముద్రవేస్తూ.. విశాల్ సోషల్ మీడియాలో స్పష్టత ఇచ్చారు. 'ఇప్పుడే ఆ రహస్యాన్ని బహిర్గతం చేసే సమయం వచ్చింది. ఇక దాచాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 'ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక సందర్భంలో 'మకుటం' మూవీ సెకండ్ లుక్‌ను మీ ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉంది.
Details
ఇది కొత్త ప్రయాణం
ఈ సినిమాకి నేను డైరెక్షన్ చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ పరిస్థితుల వలన ఈ బాధ్యతను స్వీకరించాల్సి వచ్చింది. ఇందులో ఎవరూ నన్ను బలవంతం చేయలేదు. కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకోవడం అంటే బాధ్యతను తీసుకోవడమే. సినిమా అంటే కమిట్‌మెంట్. మనపై నమ్మకంతో ఉన్న ప్రేక్షకులు, నిర్మాతల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. అందుకే రీ వర్క్ చేసి 'మకుటం'ని నా దిశలో కొనసాగిస్తున్నా. ఇది నా కొత్త ప్రయాణమని విశాల్ తెలిపారు. ఇది విశాల్ కెరీర్‌లో 35వ చిత్రం కాగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న 99వ సినిమా కూడా ఇదే.
Details
తన డైరక్షన్ లో తొలి చిత్రం
ఇదిలా ఉంటే, విశాల్ గతంలో కూడా 'డిటెక్టివ్' సినిమాకు సీక్వెల్‌గా రానున్న 'డిటెక్టివ్ 2' విషయంలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఆ ప్రాజెక్టు నుంచి దర్శకుడు మిస్కిన్ వైదొలగడంతో, ఆ సినిమాకి తానే దర్శకత్వం వహిస్తానని విశాల్ గత ఏడాది ప్రకటించారు. దాంతో తన 25 ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆ ప్రాజెక్టుపై అప్పటి తర్వాత ఎటువంటి అప్‌డేట్ రాలేదు. విశాల్ తాజా పోస్టు ప్రకారం, తన డైరెక్షన్‌లో విడుదల కానున్న తొలి చిత్రం 'మకుటం' అవుతుంది.