Kodava wedding: కొడగు సంప్రదాయంలో రష్మిక పెళ్లి.. వైరల్ అవుతున్న కొడవ వెడ్డింగ్
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంతో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంట.. సాయంత్రం కర్ణాటకలో అమలులో ఉన్న కొడవ ఆచారాలతో మరోసారి వివాహ వేడుకను జరుపుకోనున్నారు. రష్మిక స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా అనే విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో నివసించే వారియర్ కమ్యూనిటీని 'కొడవ' అని పిలుస్తారు. అయితే ఈ వర్గానికి చెందిన కుటుంబాల్లో పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో తెలుసుకుందాం.
వివరాలు
సంప్రదాయాలను గౌరవిస్తూ, పూర్వీకుల ఆచారాలను పాటిస్తూ..
కొడవ సమాజానికి ప్రత్యేకమైన సంస్కృతి, వేషభూషలు, వివాహాచారాలు ఇతర సముదాయాల కంటే భిన్నంగా కనిపిస్తాయి. యువతీ యువకులు తమ సంప్రదాయాలను గౌరవిస్తూ, పూర్వీకుల ఆచారాలను పాటిస్తూ వివాహ బంధంలోకి అడుగుపెడతారు. సాధారణ హిందూ వివాహాల్లో కనిపించేలా అగ్నిసాక్షిగా ఏడడుగులు వేయడం, దీర్ఘంగా మంత్రోచ్చారణలు జరగడం వంటి ఆచారాలు ఇక్కడ ఉండవు. చాలా సరళంగా, కుటుంబ పెద్దల సమక్షంలోనే వివాహం జరుగుతుంది. మొత్తం కార్యక్రమంలో స్థానిక సంప్రదాయం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.
వివరాలు
చర్చనీయాంశంగా మారిన కొడవ వివాహ వేడుక
మంగళస్నానంతో పెళ్లి వేడుక ఆరంభమవుతుంది.అనంతరం వధువు కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటుంది. జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్నసందర్భంగా కృతజ్ఞతాభావంతో భావోద్వేగ క్షణాలు చోటుచేసుకుంటాయి. వధువు ధరించే చీరకట్టూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కొడవ మహిళలు పైటకొంగును వెనుక నుండి ముందుకు చుట్టుకోవడం వారి ప్రత్యేకత. వేడుకంతా వలగ డ్రమ్స్ మోగిస్తూ,యోధ సంప్రదాయాన్ని గుర్తుచేసే నృత్యాలు,పాటల మధ్య ఉత్సాహంగా సాగుతుంది. గన్ సెల్యూట్ కూడా సంప్రదాయంలో భాగమే అయినప్పటికీ,ఇటీవలి కాలంలో ఆ ఆచారం తగ్గుముఖం పట్టింది. ఇలా తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ సందర్భంలో ఇరువురి సంప్రదాయాలకు సమాన గౌరవం ఇస్తూ విజయ్, రష్మిక ముందడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడవ శైలిలో జరిగే ఈ వివాహ వేడుక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.