LOADING...
AI Heroine: ప్రపంచంలో తొలి ఏఐ హీరోయిన్ మూవీ.. హాలీవుడ్‌లో కొత్త సంచలనం
AI Heroine: ప్రపంచంలో తొలి ఏఐ హీరోయిన్ మూవీ.. హాలీవుడ్‌లో కొత్త సంచలనం

AI Heroine: ప్రపంచంలో తొలి ఏఐ హీరోయిన్ మూవీ.. హాలీవుడ్‌లో కొత్త సంచలనం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీ పరిశ్రమలో సాంకేతికత ఎప్పటికప్పుడు కొత్త రూపం దాలుస్తోంది. అయితే ఈసారి హాలీవుడ్‌లో జరుగుతున్న ఒక ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డిజిటల్ ఏఐ నటి టిల్లీ నార్వుడ్ పూర్తి స్థాయి కథానాయికగా నటిస్తున్న చిత్రం 'మిస్అలైన్డ్' ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం ద్వారా ప్రధాన పాత్రలో ఏఐ నటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఏఐ హీరోయిన్‌తో కొత్త ప్రయోగం సినిమాల్లో హీరోయిన్ పాత్రలు పోషించాలని ఎంతో మంది కలలు కంటుంటారు. అయితే ఇప్పుడు ఆ స్థానానికే సాంకేతికత సవాల్ విసురుతోంది. ఏఐ ఆధారిత స్టూడియో 'పార్టికల్ 6' నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ కామెడీ-డ్రామా 'మిస్అలైన్డ్'లో టిల్లీ నార్వుడ్ ప్రధాన కథానాయికగా కనిపించనుంది.

వివరాలు 

'మిస్అలైన్డ్' కథ ఏంటి?

దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా 'టిల్లీవర్స్' అనే క్లౌడ్ ఆధారిత డిజిటల్ ప్రపంచాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతోంది. కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా తరహాలో సాగే ఈ కథలో టిల్లీ అనే ఏఐ పాత్ర చుట్టూనే కథనం నడుస్తుంది. టిల్లీకి మనుషుల మాదిరిగా శరీరం, బాల్య జ్ఞాపకాలు లేదా వ్యక్తిగత జీవిత అనుభవాలు ఉండవు. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ ఉంటుంది. కథలో కీలక మలుపు ఏమిటంటే.. డార్క్ వెబ్‌కు చెందిన ఒక రోగ్ బాట్ టిల్లీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. దాని ప్రభావంతో టిల్లీ తనకు నిర్దేశించిన నియమాలను అతిక్రమించడం ప్రారంభిస్తుంది.

వివరాలు 

హాలీవుడ్ యూనియన్ల ఆందోళన

క్రమంగా మనుషుల్లా కోరికలు, భావోద్వేగాలు, అనుభూతులను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక ఏఐ జీవి మానవ లక్షణాలను సంతరించుకునే క్రమంలో ఎదురయ్యే సంఘటనలే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. 2025 చివర్లో టిల్లీ నార్వుడ్‌ను ప్రముఖ యాక్టింగ్ ఏజెన్సీ ఒప్పందం చేసుకోబోతుందనే సమాచారం వెలుగులోకి రావడంతో హాలీవుడ్ నటీనటులు, రచయితల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటికే గ్రాఫిక్స్, డబ్బింగ్ వంటి రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతుండగా, ఇప్పుడు నటుల పాత్రలకూ అదే సాంకేతికత ప్రత్యామ్నాయంగా మారితే జూనియర్ ఆర్టిస్టుల నుంచి స్టార్ నటీనటుల వరకు ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

వివరాలు 

టాలీవుడ్‌పైనా ప్రభావం ఉంటుందా?

ప్రస్తుతం ఈ తరహా ప్రయోగాలు హాలీవుడ్‌కే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో భారతీయ సినీ పరిశ్రమలోనూ, ముఖ్యంగా భారీ బడ్జెట్ టాలీవుడ్ చిత్రాల్లోనూ నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు ఏఐ నటీనటులను వినియోగించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఏర్పడితే నటీనటుల కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Advertisement

వివరాలు 

ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో?

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న 'మిస్అలైన్డ్' చిత్రం భవిష్యత్తులో పలు ప్రాంతీయ భాషల్లోనూ డబ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. వెండితెరపై పూర్తిస్థాయి కథానాయికగా కనిపించనున్న ఏఐ నటి టిల్లీ నార్వుడ్‌ను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం విజయవంతమైతే సినీ పరిశ్రమలో ఏఐ వినియోగానికి కొత్త దారులు తెరుచుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement